సాయం.. సేవే ఏసు మార్గం : బండారు దత్తాత్రేయ

సాయం.. సేవే ఏసు మార్గం : బండారు దత్తాత్రేయ

బంజారాహిల్స్ లోని ఇంద్రలోక్ అపార్ట్ మెంట్ లో క్రిస్మస్  డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. క్రీస్తు పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని, ఇదే రోజు మరో మహనీయుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి జరుపుకోవడం సంతోషకరం అన్నారు. ప్రేమ, కరుణ, దయ, సౌభ్రాతృత్వం, మానవత్వ విలువలతో ప్రపంచానికి సందేశం ఇచ్చారన్నారు. అవే విలువలతో వాజ్ పేయ్ ప్రధానిగా పరిపాలన సాగించారన్నారు.  

హిందువులయినా, ముస్లింలైనా, క్రైస్తవులైనా 130 కోట్ల మంది ప్రజలకి భారతీయులందరం ఒక్కటే అన్న భావన రావాలని దత్తాత్రేయ అన్నారు. సేవే మార్గమన్నదే ఏసు క్రీస్తు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవుల పట్ల సుహృద్భావం చూపాలన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.