విచారణకు సహకరిస్తా.. రెండ్రోజులు గడువు కావాలని పోలీసులకు బండి భగీరథ్‌‌‌‌ మెయిల్‌‌‌‌

విచారణకు సహకరిస్తా.. రెండ్రోజులు గడువు కావాలని పోలీసులకు బండి భగీరథ్‌‌‌‌ మెయిల్‌‌‌‌
  • పలు పత్రాలు సమీకరించుకోవాల్సి ఉందని వెల్లడి
  • ముందస్తు బెయిల్‌‌‌‌ పిటీషన్‌‌‌‌పై నేడు హైకోర్టులో విచారణ     

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోక్సో కేసులో పోలీసుల ముందు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు కావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌ కుమారుడు సాయి భగీరథ్‌‌‌‌ విజ్ఞప్తి చేశాడు. దర్యాప్తుకు అవసరమైన కొన్ని ఆధారాలు సమకూర్చుకోవాల్సి ఉందన్నా డు. ఈ మేరకు పేట్‌‌‌‌ బషీరాబాద్ పోలీసులకు బుధవా రం మధ్యాహ్నం మెయిల్‌‌‌‌ ద్వారా సమాచారం అం దించాడు. పోక్సో కేసులో బుధవారం దర్యాప్తుకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసుల ప్రకారం.. బండి భగీరథ్‌‌‌‌ తో కలిసి ఆయన మేనమామ వంశీకృష్ణ పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. కాగా, పోలీసుల నుంచి తనకు నోటీసు అందినట్లు భగీరథ్‌‌‌‌ ధ్రువీకరిం చాడు. కాగా, భగీరథ్​ నుంచి వచ్చిన మెయిల్‌‌‌‌కు పోలీసులు రిప్లై ఇవ్వలేదని తెలిసింది. మరోవైపు భగీరథ్‌‌‌‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌‌‌‌పై గురువారం హైకోర్టులో విచారణ జరుగనుంది.

అడిగిన ప్రతి సమాచారం ఇస్తా.. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు అడిగిన  ప్రతి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు భగీరథ్​తెలిపాడు. ఈ మేరకు మెయిల్‌‌‌‌లో పలు అంశాలు వివరించాడు. ‘‘ నా హక్కులకు భంగం కలగకుండా దర్యాప్తు అధికారి ముందు హాజరై, సహకరిస్తానని వినయపూర్వకంగా విన్నవించుచున్నాను.  నాకు చాలా తక్కువ వ్యవధిలో నోటీసు ఇచ్చినందున, 13.05.2026(బుధవారం) రోజు కొన్ని వ్యక్తిగత అసౌకర్యాల కారణంగా.. నోటీసులో నిర్దేశించిన తేదీన హాజరు కాలేకపోతున్నాను.

నాపైనా, నా కుటుంబంపైనా చేసిన తప్పుడు ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తునకు సహకరిస్తాను. నా వద్ద ఉన్న సంబంధిత సామాగ్రి, పత్రాలు, సమాచారాన్ని సమీకరించుకోవడానికి వీలుగా.. నోటీసులో నిర్దేశించిన తేదీ నుంచి రెండు రోజులు వెసులుబాటు కల్పించాలని అభ్యర్థిస్తున్నాను.” అని మెయిల్‌‌‌‌లో వెల్లడించాడు. దర్యాప్తు అధికారుల ఆదేశాలకు లోబడి విచారణకు హాజరవుతానని హామీ ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు. 

మరోసారి నోటీసులు

భగీరథ్ మెయిల్ తమకు చేరలేదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. బుధవారం విచారణకు హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ లోని భగీరథ్ మేనమామకు నోటీసులు అందించారు. మరోవైపు భగీరథ్ ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్, ఢిల్లీలో నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.