- ఆధారాలు సేకరిస్తున్నం.. వాళ్లను వదిలిపెట్టం: బండి సంజయ్
- కొందరు ఐఏఎస్లు మంత్రులకు బ్రోకర్లుగా మారారు
- కాంగ్రెస్ అంటే.. కరప్షన్, కమీషన్, కలెక్షన్ అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై కేంద్ర ప్రభుత్వం కన్నేసిందని, వారి చిట్టా అంతా త్వరలోనే బయటపెడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కొందరు ఐఏఎస్ అధికారులు మంత్రులకు మధ్యవర్తులుగా ఉంటూ కమీషన్లు వసూలు చేస్తున్నారని, వారి బాగోతంపై ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.
గురువారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఇతర నేతలు రాంచందర్ రావును ఘనంగా సన్మానించారు.
టీపీసీసీ అంటే టీ4సీ..
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండానే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేయడం దుర్మార్గమని బండి సంజయ్అన్నారు. కేవలం ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటానికే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విభజించారని పేర్కొన్నారు. 70 లక్షల జనాభా ఉంటే.. పాతబస్తీ పరిధిలో 30 లక్షలకు పైగా ముస్లిం ఓట్లను సమీకరించి హిందూ ఓట్లను చీల్చడమే ఈ కుట్ర వెనుక అసలు ఉద్దేశమని ఆరోపించారు.
కోటిన్నర జనాభా ఉన్న ముంబైని, 2 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీని విడదీయని వారు.. ఇక్కడ ఎందుకు విడదీస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మూసీ నదిలో పడేయడం ఖాయమన్నారు. టీపీసీసీ అంటే టీ4సీ (తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్, కాంగ్రెస్) గా మారిపోయిందని ఆరోపించారు.
ఐఏఎస్ అధికారులకు వార్నింగ్..
మంత్రుల అవినీతికి ఐఏఎస్ అధికారులు సహకరిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ‘‘మంత్రి పదవుల అండతో బీజేపీని అడ్డుకోవాలని చూస్తే మీ సంగతి చూస్తం. 2047 దాకా దేశంలో బీజేపీయే అధికారంలో ఉంటుంది. 2029 నాటికి దేశంలో కాంగ్రెస్ అడ్రస్ ఉండదు. ఐఏఎస్ అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలి కానీ మంత్రులకు బ్రోకర్లుగా మారొద్దు’’ అని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్నారు.
రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారే: రాంచందర్ రావు
కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం భవిష్యత్తులో రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పడానికి సంకేతమని రాంచందర్ రావు అన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ సొంతంగా గెలుచుకోవడం చారిత్రాత్మకమని కొనియాడారు. దీని కోసం కృషి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇన్ చార్జ్ మనోహర్ రెడ్డిని అభినందించారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా మేధావులు, ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని, త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు.
