
రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి...ఆ నెపాన్ని బీజేపీపైకి నెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని బండి సంజయ్ అరోపించారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని..ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా ఘర్షణలు జరగలేదన్నారు. తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోవడానికి.. హైదరాబాద్ లో గొడవకు కారణం ఎవరో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే కమెడియన్ మునావర్ ఫారుఖీని హైదరాబాద్ రప్పించారని తెలిపారు. ట్రిపుల్ తలాక్, ఆయోధ్యపై తీర్పు, ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు దేశంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదన్నారు. అభివృద్ధిపై ముఖ్యమంత్రి చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడితే కేసీఆర్ మతం గురించి మాట్లాడుతున్నారన్నారు.
యాత్రను అడ్డుకోవడానికి దొంగ కేసులు పెట్టారు
దళిత బంధు టీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప ఎవ్వరికీ ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు. ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసే ప్రజా సంగ్రాయాత్రను అడ్డుకోవడానికి దొంగ కేసులు పెట్టారని మండిపడ్డారు. కావాలనే దాడులు చేయించి అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు. దళిత బంధు ఎంద మందికి ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఏండ్లు గడుస్తున్నా పోడు భూముల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
కృష్ణా జలాల వాటా ఏమైంది?
పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి కారణం ఎవరో సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఏం అభివద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతి పథకానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టంగా చెబుతామన్నారు. మూసీ ప్రక్షాళన... కృష్ణా జలాల వాటా ఏమైందని ప్రశ్నించారు. 575 టీఎంసీలు కృష్ణ జలాలు రావాల్సి ఉండగా.. అప్పటి సీఎంతో కుమ్మక్కై.. 299 టీఎంసీలకు అగ్రిమెంట్ పై సంతకం చేశారని తెలిపారు. ఇప్పుడు సీఎం తమకు 575 టీఎంసీలు రావాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 575 టీఎంసీలపై ఎందుకు ఫైట్ చేయడం లేదన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీలైనా ఎందుకు వాడుకోవడం లేదన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందన్నారు.