బీఆర్ఎస్ సర్కార్​ హయాంలో ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించలే - బండి సంజయ్ 

బీఆర్ఎస్ సర్కార్​ హయాంలో ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించలే - బండి సంజయ్ 

 

  • ప్రైవేట్ కాలేజీలకు రూ.7,800 కోట్ల బకాయిలున్నయ్
  •  సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్  

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ఫీజు రీయింబర్స్‌‌మెంట్ నిధులను సక్రమంగా కాలేజీలకు చెల్లించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రీయింబర్స్​మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల పరిస్థితి దుర్భరంగా మారిందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడేళ్లుగా దాదాపు రూ.7,800 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలు, కాలేజీ భవనాల రెంట్, మెయింటెనెన్స్ చార్జీలు చెల్లించలేక వందలాది కాలేజీలు మూతపడ్డాయన్నారు. డిగ్రీ, పీజీ కాలేజీలకు మార్చి నెలాఖరు నాటికి దాదాపు రూ.750 కోట్లను చెల్లిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం టోకెన్లు జారీ చేసిందని, కానీ నయా పైసా ఇవ్వలేదన్నారు. ఆదివారం నాటితో టోకెన్ల గడువు ముగుస్తోందని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిర్దిష్ట గడువులోగా ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలన్నీ చెల్లించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రీయింబర్స్‌‌మెంట్ చెల్లింపుల విషయంలో మరింత మెరుగైన విధానాన్ని అమలు చేయాలని కోరారు.