
- వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఏమైందని ప్రశ్న
- సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి లేఖ
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. కొన్నేండ్లుగా పేరుకుపోయిన రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకపై ప్రతిఏటా నిర్ణీత వ్యవధిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, నర్సింగ్ సహా వేలాది కాలేజీలు సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించడం లేదు. గత నాలుగేండ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో రూ.8 వేల కోట్లు పేరుకుపోయాయి. దీంతో మేనేజ్మెంట్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. లెక్చరర్లకు, సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేని స్థితికి చేరాయి. బకాయిలు రిలీజ్ కాక, చేసిన అప్పులు తీర్చలేక ఇప్పటికే అనేక కాలేజీలు మూతపడ్డాయి.
ఫీజు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెబుతుండటంతో విద్యార్థులు అటు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేక, ఇటు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు” అని పేర్కొన్నారు. ‘‘బకాయిలను వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద సెటిల్ చేసే బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అదే విధంగా ఈ ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్ణీత టైమ్‌లో చెల్లిస్తామని మాట ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు కావడం లేదు. -ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి” అని కోరారు.