
- నేనెక్కడ పోటీ చేయాలో హైకమాండ్ నిర్ణయిస్తది: బండి సంజయ్
- రాష్ట్రంలో రాక్షస పాలన.. ఉద్యమిస్తే పోలీసులతో అణచివేత
- ఉద్యమకారులారా.. కేసీఆర్ చేతిలో మళ్లీ మోసపోకండి
- కేసీఆర్‌కు లెఫ్ట్, రైట్ ఉన్నోళ్లంతా ఉద్యమద్రోహులే
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని, ఉద్యమాలు చేస్తే పోలీసులతో ప్రభుత్వం అణచివేస్తున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికలు వస్తుండటంతో సీఎం కేసీఆర్ ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని, మరోసారి ఆయన చేతిలో మోసపోవద్దని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. ‘‘నేను అసెంబ్లీకి పోటీ చేయాలా? పార్లమెంట్‌కు పోటీ చేయాలా? ఎక్కడ నుంచి పోటీ చేయాలి? అనే విషయం హైకమాండ్ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయమే శిరోధార్యం” అని సంజయ్ చెప్పారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో తెలంగాణ ఉద్యమకారులు బండి సంజయ్‌ని కలిశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువైందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంతో రాష్ట్రంలో ఎంతమంది కాళ్లు తడిపారో, ఎన్ని ఎకరాలను నీళ్లిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీని సంకనేసుకున్నాడు. కేసీఆర్‌కు లెఫ్ట్, రైట్ ఉన్నోళ్లంతా ఉద్యమ ద్రోహులే” అని ఆరోపించారు.
లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారా? లేదా? అనే అంశాన్ని సీబీఐ, ఈడీ చూసుకుంటాయని, అవి స్వతంత్ర సంస్థలని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ విధానాలు నచ్చి పార్టీలోకి వచ్చే వాళ్లను చేర్చుకుంటామని, మోదీని బూతులు తిట్టినోళ్లను, బీజేపీని బదనాం చేసినోళ్లను పార్టీలోకి రానీయబోమని స్పష్టం చేశారు. అంతకుముందు కరీంనగర్ నాకా చౌరస్తాలో బండి సంజయ్ చిన్నారులతో ముచ్చటిస్తూ సరదాగా సైకిల్ తొక్కారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న, సొల్లు అజయ్ వర్మ, గడ్డం నాగరాజుతో కలిసి తిమ్మపూర్ లోని రామక్రిష్ణ నగర్ కాలనీలో రూ.9 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు డోలు వాయిద్యాలతో సంజయ్ కు స్వాగతం పలికారు.