అమ్మాయిలకు హైదరాబాద్ సేఫ్ జోన్ కాదు 

అమ్మాయిలకు హైదరాబాద్ సేఫ్ జోన్ కాదు 
  • క్రిమినల్స్ కు హైదరాబాద్ అడ్డగా మారింది
  • కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు
  • ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లను ఎందుకు చేర్చలేదు..?
  • సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు
  • రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ 

హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసును సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇవాళ అమ్మాయిలకు హైదరాబాద్ సేఫ్ జోన్ కాదని, క్రిమినల్స్ కు, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మైనర్ బాలికపై గత నెల 28న (మే 28న) అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే 31వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులో నిందితుల పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బాధితురాలు నిందితుల పేర్లు చెప్పినా ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదన్నారు. నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రజాప్రతినిధుల పిల్లలపై ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. నిందితులను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసుతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించాలని ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయని ఆరోపించారు. మైనర్ బాలికపై అత్యాచార సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటన్నారు. 

ఈ కేసు విషయంలో నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనలు చేసిన బీజేపీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారుల్లో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

గతంలో డ్రగ్స్ కేసులోనూ హంగామా సృష్టించి, కేసును వదిలేశారని, ఏ కేసులోనూ పురోగతి లేదన్నారు. ఇప్పటికైనా బాధితురాలి విషయంలో న్యాయం చేయాలన్నారు. హైదరాబాద్ లో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై నమ్మకం లేదని, ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దు : కేటీఆర్ డిమాండ్

మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి ఎంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని మంత్రి కోరారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న వార్త చూసి షాకయ్యానని అన్నారు. ఈ కేసులో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బీజేపీ శ్రేణులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలో బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి చొచ్చుకెళ్ల‌డంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

మరిన్ని వార్తల కోసం..

ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ అంబానీ