అది చాలా చిన్న యాక్సిడెంట్.. సిటీ ట్రాఫిక్ రద్దీలో చూసుకుంటే మాత్రం అది యాక్సిడెంట్ అని కూడా అనలేం.. అలాంటి ఘటనలో.. ఏకంగా ఓ ఐటీ కంపెనీ మహిళా సీనియర్ ఉద్యోగిని.. HR హెడ్ కన్ను పోయింది.. అవును మహారాష్ట్ర రాష్ట్రం పూణెలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే... చెంబూర్ కి చెందిన హెచ్ఆర్ ప్రొఫెషనల్ పూజా గుప్త తన కాబోయే భర్తతో కలిసి పుణెలోని పూనావాలాలోని అత్తామామలను చూసేందుకు వెళ్లి ముంబైకి కారులో తిరిగి వస్తుండగా... ముగ్గురు యువకులు దాడి చేయడంతో ఆమె కన్ను పోయింది.
పూజా గుప్త తన కాబోయే భర్తతో కలిసి తిరిగి వస్తుండగా.. బైక్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులలో ఒకరి కాలుపై కారు టైర్ ఎక్కింది. ఎవరికి గాయాలు కాకపోయినా.. ఆ యువకులు కారులో వెళ్తున్న జంటతో వాగ్వాదానికి దిగారు. పూజ, ఆమె కాబోయే భర్తను దుర్భాషలాడుతూ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన పూజ ఫియాన్సీ కారును వేగంగా నడిపాడు.
ఈ క్రమంలో కారును వెంబడించిన ముగ్గురు యువకులు రాళ్లతో దాడి చేసి.. కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పగిలిన అద్దం ముక్క పూజ కంటికి తగిలి తీవ్ర గాయమయ్యింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం చించ్వాడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూజ కంటికి తీవ్ర గాయమవడంతో సర్జరీ చేశారు డాక్టర్లు. సర్జరీ అయ్యి వారం రోజులు గడుస్తున్నా తనకు చూపు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది పూజ.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. అయితే.. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరగా.. పోలీసులు తమ రిక్వెస్ట్ ను పరిగణించలేదని అంటున్నారు బాధితులు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇంకోసారి ఇలా ఎవరైనా ఇలాంటి దాడి చేయాలంటే భయపడేలా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బాధితులు.
