క్లోహీ, రోహిత్ సహా ప్రతి ఒక్కరూ రెండు మ్యాచులు ఆడాల్సిందే: భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం

క్లోహీ, రోహిత్ సహా ప్రతి ఒక్కరూ రెండు మ్యాచులు ఆడాల్సిందే: భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025, డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ లీగ్ విజయ్ హజారే ట్రోఫీలో ప్రస్తుత భారత ఆటగాళ్లందరూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది. దీంతో సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు శుభ్‌మాన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు కూడా తమ జట్ల తరుఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచులు తప్పక ఆడాల్సిందే. ఏ రెండు మ్యాచులు ఆడాలనుకుంటున్నారో ఆటగాళ్లు, ఆయా స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ నిర్ణయించుకోవాలని బీసీసీఐ స్పష్టం చేసింది. 

ప్రస్తుతం టీమిండియా, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ 2025, డిసెంబర్ 19న ముగుస్తోంది. ఈ సిరీస్ తర్వాత 2026, జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత మూడు మ్యాచుల వన్డే సిరీస్‎ ఆడనుంది. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ముగింపు, న్యూజిలాండ్‎తో వన్డే సిరీస్ ప్రారంభానికి మధ్య మూడు వారాల గ్యాప్ ఉంది.

ఈ గ్యాప్‎లో క్రికెటర్లు ఫామ్, ఫిట్‎నెస్ కోల్పోకుండా విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచులు ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. అంతేకాకుండా రోహిత్, కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లకు కూడా బోర్డు నియమాలను ఒకే విధంగా సెట్ చేయాలని బీసీసీఐ భావించడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అయితే.. ప్లీహ గాయంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు ఈ నిబంధనలను మినహాయించింది. 

అంతర్జాతీయ టెస్ట్, టీ20లకు గుడ్ బై చెప్పిన టీమిండియా దిగ్గజ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతోన్న విషయం తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్ ప్లేయర్స్ ఫామ్, ఫిట్ నెస్ కోల్పోకుండా దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటామని ఈ మేరకు తమ స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్‎కు సమాచారం అందించారు. రోహిత్ శర్మ ముంబై తరుఫున బరిలోకి దిగనుండగా.. కోహ్లీ ఢిల్లీ తరుఫున ఆడనున్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగతుండటంతో డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీపై ఈ సారి భారీగా హైప్ నెలకొంది.