చండీగఢ్: పంజాబ్ కబడ్డీ ప్లేయర్, ప్రమోటర్ రాణా బాలచౌరియా దారుణ హత్యకు గురయ్యాడు. మొహాలిలో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటన సోమవారం (డిసెంబర్ 15) సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సెక్టార్ 82లోని ఒక మైదానంలో జరిగింది. నిందితులు సెల్ఫీ అంటూ దగ్గరికి వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బాలచౌరియా తల, ముఖంపై గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ అతడు ఆరోగ్యం విషమించి మరణించాడు. కాల్పులు జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ కార్యక్రమానికి డీఎస్పీ హెచ్ఎస్ బాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వేదిక నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే కాల్పులు జరిగాయి. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి ప్రవేశిస్తుండగా బొలెరో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తుపాకీ కాల్పుల మోతతో భయభాంత్రులకు గురైన ఆటగాళ్లు, ప్రేక్షకులు గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు బాంబిహా గ్యాంగ్ బాధ్యత వహించింది. పంజాబ్ లో సంచలనం రేపుతోన్న ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాణా హత్యకు పాత కక్షలు కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వెళ్తున్న పంజాబీ గాయకుడు మన్కీరత్ ఔలాఖ్ కాల్పుల ఘటన గురించి తెలియగానే వెనుదిరిగారు.
