BBL 2025-26: డేంజరస్ డెలివరీస్: బిగ్ బాష్ లీగ్‌లో పాక్ స్టార్ పేసర్‌కు చేదు జ్ఞాపకం.. ఓవర్ మధ్యలోనే పంపించేశారు

BBL 2025-26: డేంజరస్ డెలివరీస్: బిగ్ బాష్ లీగ్‌లో పాక్ స్టార్ పేసర్‌కు చేదు జ్ఞాపకం.. ఓవర్ మధ్యలోనే పంపించేశారు

పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా పేరుంది. న్యూ బాల్ తీసుకొని బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. పదునైన యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అఫ్రిది తొలిసారి బిగ్ బాష్ లీగ్ ఆడుతూ ఈ లీగ్ లో ప్రధాన ఆకర్షణగా మారాడు. బ్రిస్బేన్ హీట్ తరపున తన బిగ్ బాష్ అరంగేట్రం చేసిన ఈ పాక్ స్పీడ్ స్టర్ కు తొలి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది. సోమవారం (డిసెంబర్ 15) గీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియంలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మధ్యలోనే బౌలింగ్ చేయకూడదని అంపైర్లు అఫ్రిదికి సూచించారు.

ఓవర్లో మూడు నో బాల్స్:

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 18 ఓవర్లో బౌలింగ్ చేయడానికి షహీన్ అఫ్రిది వచ్చాడు. మూడో బంతికి ఫ్రాంట్ ఫుట్ నో బాల్ వేసిన అఫ్రిది ఆ తర్వాత ఇదే ఓవర్లో భీమర్ల రూపంలో రెండు నో బాల్స్ వేశాడు. ఓవర్ లో రెండు భీమర్లు వేయడంతో అఫ్రిదిని అంపైర్లు బౌలింగ్ వేయకుండా ఓవర్ మధ్యలోనే పంపించేశారు. అంతర్జాతీయ క్రికెట్ లోని రూల్స్ ప్రకారం ఒక బౌలర్ తన ఓవర్ లో రెండు బీమర్లు వేస్తే బౌలింగ్ కొనసాగించడానికి అనుమతి ఉండదు. 

అఫ్రిది బౌలింగ్ నుంచి తప్పుకోవడంతో మెక్‌స్వీనీ ఓవర్ లో చివరి రెండు బంతులను వేసి ఓవర్ ను ముగించాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 2.4 ఓవర్లు బౌలింగ్ వేసిన అఫ్రిది 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తొలి మ్యాచ్ లోనే ఈ పాక్ స్టార్ పేసర్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన  మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. సీఫెర్ట్ (102) సెంచరీతో దుమ్ములేపితే.. ఆలివర్ పీక్ (57) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.