మేడారం శిలలపై తల్లుల చరిత్ర.. 750 కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా 7 వేల చిహ్నాలు

మేడారం శిలలపై తల్లుల చరిత్ర.. 750 కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా 7 వేల చిహ్నాలు
  • 750 కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా 7 వేల చిహ్నాలు
  • గొట్టుగోత్రాలకు ప్రతిరూపమైన సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంకకు చోటు 
  • ప్రధాన స్వాగత ద్వారంపై 59 బొమ్మలతో సమ్మక్క వంశీయుల చరిత్ర
  • కోయల దైవాలు, జీవనశైలి, ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యం
  • పులి, జింక, నెమలి, దుప్పి, పావురం, చెట్టు, పిట్టలకూ చోటు 
  • రాయచోటి నుంచి రాళ్లు.. ఆళ్లగడ్డలో చెక్కిన కళాకారులు
  • 600 కిలోమీటర్ల దూరం నుంచి భారీ ట్రక్కుల్లో తరలించి పనులు
  • రూ.236 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్న ప్రభుత్వం

వరంగల్‍ / ములుగు, వెలుగు: ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారంలో పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్నది. మరో వందేండ్లయినా చెక్కుచెదరకుండా ఉండేలా గ్రానైట్‌తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నది. కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా పనులు చేపడుతూ.. సమ్మక్క, సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలలపై చెక్కుతున్నది. కోయల వద్ద దొరికిన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన ఏడు వేల శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతో పాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. అలాగే సమ్మక్క సారక్క వంశస్తులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కలుగుతుందని ఆలయ అభివృద్ధి పనులు చూస్తున్న ఆర్కిటెక్ట్‌‌‌‌లు తెలిపారు. 

50 ఫీట్ల వెడల్పుతో ప్రధాన ద్వారం.. 

గద్దెల ముందు తెల్లని గ్రానైట్​స్తంభాలతో ఏర్పాటు చేస్తున్న ప్రధాన ద్వారం, ఆయా శిలలపై సమ్మక్క సారక్క పూర్వీకులతో పాటు కోయల జీవనశైలిని తెలిపేలా చెక్కిన ఏడు వేల బొమ్మలు హైలెట్‍గా నిలవనున్నాయి. 50 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఈ ప్రధాన ద్వారానికి 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో రెండువైపులా రెండేసి నిలువు స్తంభాలు, వాటిపై 80 ఫీట్ల పొడవైన అడ్డు స్తంభం,  దాని మీద 60 ఫీట్ల పొడువైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో 8 స్తంభాలు నిలుపుతున్నారు. వీటిపై సమ్మక్క సారక్కతో పాటు 3,4,5,6,7 గొట్టుగోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటివైపు శిలలపై ఆదివాసీల జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలను గీశారు. వీటిని చెక్కేందుకు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దాదాపు 450 మంది కళాకారులు నెలల తరబడి రేయింబవళ్లు శ్రమించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తెప్పించిన భారీ గ్రానైట్‍ రాళ్లను ఇందుకోసం వినియోగించారు. తయారీ అనంతరం భారీ ట్రక్కుల్లో 600 కిలోమీటర్ల దూరంలోని మేడారానికి తరలించారు. 

ప్రధాన ద్వారం ఎడమ వైపు నిలువు పిల్లర్.. 

కింది భాగంలో ఎడమ వైపు పిల్లర్ పూర్తిగా మూడొ గొట్టు సారక్క వంశవృక్షంతో పాటు వడ్డే గోత్రం సిద్ధబోయిన, కొక్కెర వంశం వృక్షాన్ని తెలుపుతుంది.
మూడు నిలువు, అడ్డం గీతలు: మూడొ గొట్టు గోత్రం గురించి తెలిపే గుర్తులు.
త్రిభుజాలు: పగిడిద్దరాజు సమ్మక్క/నాగులమ్మల 
బిడ్డ సారలమ్మ రాజ్యం మూడో గొట్టుకి వచ్చిందని తెలుపుతుంది. 
చతురస్రం సగం ముక్కలు: సారలమ్మను.. కాక ఆడమరాజుకి ఇచ్చి పెళ్లి చేసి నాలుగో రాజ్యంలో సగం ఇచ్చిన సందర్భం.
ఎడమవైపు రెండో పిల్లర్‍పై.. ఇప్ప చెట్టు: మూడో గొట్టు పవిత్ర వృక్ష దైవం.  
మనిషి చేతిలో బాణం: కాక ఆడమరాజు కళ్లకు గంతలుకట్టుకొని కాకిని కొడుతూ సారలమ్మను పెళ్లి చేసుకున్న సందర్భం. 
ఉడుము: మూడో గొట్టు వారు పూజించే జంతువు. 
ఎనిమిది పలకలు: ఎనిమిదో గొట్టు రాజ్యం గుర్తు. 
ఎక్స్ ఆకారం: ఎనిమిదో గొట్టు వడ్డే గోత్రం గుర్తు.  
సమ్మక్క తల్లిది 5వ గొట్టు.. 
3వ గొట్టు: సారలమ్మ–కాక ఆడమరాజు వంశ వృక్షం, వడ్డే గోత్రం సిద్ధరబోయిన, కొక్కెర వంశ వృక్షం
4వ గొట్టు: నాగులమ్మ రాయి బండానీ వంశం. పగిడిద్దరాజు, గోవిందరాజుల మూలాలు. 
5వ గొట్టు: సమ్మక్క తల్లిది కోయ సమజాంలో రాయి బండానీ వంశం.
6వ గొట్టు: బేరం బోయినరాజు (పశుపతి) వంశస్తుల ప్రతిరూపం. 
7వ గొట్టు: గట్టు పారేడు వంశస్తులది. ఇది వారి నుదుటి బొట్టును తెలుపుతుంది.  

శివ లింగాలు, వెంకన్న నామాలు కూడా.. 

గోవిందరాజుల ప్రధాన గద్దెలపై తిరుపతి వెంకన్న నామాలు, శంకు, స్వస్తిక్‍ వంటి చిత్రాలు ఉండగా..పలుచోట్ల శివలింగాలు సైతం చెక్కారు. కోయ వంశీకుల్లో గోవిందరాజులు, బేరంబోయిన రాజు (పశుపతి) కాలాల్లో ప్రకృతి శక్తిగా వెంకన్నను, శివున్ని ఆరాధించినట్లు ఆదివాసీ మూలాలపై పరిశోధనలు చేసిన చరిత్రకారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాన గద్దెలు, శిల్పాలపై నామాలు, శంకు, లింగాలు చెక్కినట్టు పేర్కొంటున్నారు. కాగా, కోయ పూర్వీకులు వారిని ఇతర దైవాలమాదిరి ప్రకృతి శక్తులుగా మాత్రమే చూశారు తప్ప ఇప్పుడు ఆచరణలో ఉన్న ఆలయాల్లో ఉన్నట్లు పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయలేదంటున్నారు. స్వస్తిక్‍ గుర్తు కోయల కాలంలో రివర్సులో ఉందని.. ఆ తర్వాత కొందరు ప్రస్తుత రూపానికి తెచ్చినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. తాళపత్ర గ్రంథాల్లో ఉన్న పూర్తి సమాచారంతో మేడారం ఆలయ పూజరుల అంగీకారం అనంతరమే ఈ చిత్రాలను చెక్కించినట్లు వెల్లడించారు.

రూ.236 కోట్లతో పునరుద్ధరణ పనులు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారక్క గద్దెల పునరుద్ధరణ పనులను రూ.236.2కోట్లతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ పనులను ఈ ఏడాది సెప్టెంబర్​23న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే ఏడాది జనవరి 10కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, కొండా సురేఖ తదితరులు పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఒకే వరుసలో గద్దెల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా.. ఈ నెల 24న గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల ప్రతిష్టాపన చేయనున్నట్టు పూజారులు తెలిపారు. 2026 జనవరి 28 నుంచి 31వరకు మహాజాతర జరుగనుండగా, అంతకు 15 రోజుల ముందు నుంచే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్నారు.

సమ్మక్క ఇంటి దైవం.. ఒంటికొమ్ము దుప్పి 

సమ్మక్క తల్లి కొలువుండే చిలుకలగుట్ట వైపు నిర్మించిన స్వాగత తోరణం, దానిపై చెక్కిన 59 బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందులో సమ్మక్క వంశీయుల మూలాలు, కోయల సంస్కృతీ సంప్రదాయాలు, వారు దైవంగా కొలిచే పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. సమ్మక్క తల్లిది కోయ సమాజానికి చెందిన రాయి బండానీ వంశంలోని 5వ గొట్టు కావడంతో.. సమ్మక్క తల్లి ఇంటి దైవంగా భావించే ఒంటికొమ్ము దుప్పి బొమ్మను జాతర ప్రధాన శిలగా భావించే స్వాగత తోరణంపై అగ్రభాగాన చెక్కారు. పక్కన అడవిదున్న కొమ్ములు, వాటిపై ఆరు నెమలి ఈకలు పొందుపరిచారు. కోయల్లో ముఖ్యమైన బేరం బోయినరాజు (పశుపతి) ఆరో గొట్టు ప్రతిరూపంగా గిరిజనులు నేటికీ నెమలికలను ధరించి నృత్యం చేయడం ఆనవాయితీ. 

ద్వారం కుడివైపు నిలువు పిల్లర్లపై..

ఐదు నిలువు గీతలు: ఐదో గొట్టును 
తెలియజేస్తుంది. 
ఐదు పలకల గుర్తు: ఐదో గొట్టు రాజ్యం గుర్తు తెలుపుతుంది. 
నాలుగు నిలువు గీతలు: నాలుగో గొట్టును తెలియజేస్తుంది. 
4 పలకలు: నాలుగో గొట్టు రాజ్యం గుర్తు. 
కంకవనం: ఐదో గొట్టు గోత్రం వృక్షం వెదురు చెట్టు. ఇది సమ్మక్క తల్లి ప్రతి రూపం. 
పక్షి పావురం: ఐదొ గొట్టు గోత్రం.  
తెల్ల గుర్రం: ఐదో గొట్టు వారి వాహనం.  
స్వస్తిక్: కోయ రాజ్యాలు పూర్వం వ్యాపారాలు చేసిన సందర్భ గుర్తు.
నెమలి: నెమలిని సమ్మక్క తల్లి ప్రతిరూపంలా భావిస్తారు. మారేడు చెట్టు: బండానీ వంశం పూజిత వృక్షం. 

ఒక్కో చిహ్నానికి ఒక్కో ప్రత్యేకత... 

ప్రధాన ద్వారం అడ్డం రెండో వరుస.. 
18 దిక్కుల చిహ్నం: కింది భాగంలో చెక్కిన ఈ గుర్తు ప్రాచీన అఖండ భారత భూభాగంలోని 18 దిక్కులను తెలియజేస్తుంది. ఉత్తర భారతాన మూడో గొట్టు 36 రాజ్యాలను, దక్షిణాన బెరంబోయిన రాజు ఆరో గొట్టు 18 రాజ్యాలు పాలించినట్టు కోయల చరిత్ర చెబుతున్నది.  
నెలవంక, ఏనుగు:నెలవంక అంటే ఆరో గొట్టు బేరంబోయిన వంశం వారి నుదుటిబొట్టును తెలుపుతుంది. వారి గోత్ర జంతువు ఏనుగు. మూడు అడ్డగీతలు మధ్యలో చుక్క.
ఆదిశక్తి:  కోయలు ప్రకృతి అర్థంలో స్త్రీ అండ రూపాన్ని (సంతానోత్పత్తిలో కీలకం కాబట్టి) దైవంగా పూజిస్తారు. ఆదిశక్తి మళ్లీ 
సమ్మక్క రూపంలో అవతరించిందని కోయలు నమ్ముతారు.
పులి: సమ్మక్క తల్లి పులి రూపంలోఉంటుందన్నది కోయల విశ్వాసం.
కోయతుర్ ధర్మ చిహ్నం: కోయల ఇంటి పేర్లు, సంప్రదాయాలతో పాటు పశుపతి బేరంబోయిన రాజు ధర్మం దిశానిర్దేశంగా భావిస్తారు. 
తూతకొమ్ము: కోయలు వేల్పు పండగ, జాతర సమయంలో దీన్ని ఉపయోగిస్తారు. ఇది పవిత్ర వాయిద్యం. ఈ శబ్దం లేకుండా దైవం కొండ దిగిరాదని చెప్తారు.
చక్రం: రాయి బండానీ వంశంలో రాయి బండానీ రాజు బండి చక్రం కనుగొన్నాడని చెప్తారు. అందుకే రాయి బండానీ వంశం చిహ్నంగా చక్రాన్ని కొలుస్తారు. 
రంభ: సమ్మక్క తల్లి అడవిలో రంభ అనే పక్షి రూపంలో ఉంటుందని కోయలు భావిస్తారు.
నాగుపాము: సమ్మక్క చెల్లెలు నాగులమ్మ నాగుపాము రూపంలో ఉందని నమ్ముతారు.
ఎండి ముక్కు కొకాడి, పైడి ముక్కు కొకాడి: కోయలకు అడవిలో భూమి జీవనానికి అనువుగా ఉండేది కాదు. భూమి బురదగా ఉండటానికి కారణమైన ఏర పురుగులను కాకులు తినడం ద్వారా భూమి గట్టి పడేలా సహాయం చేశాయని ఈ చిహ్నం తెలుపుతుంది.
ఎద్దు: వడ్డే గోత్రం మూగొ గొట్టు నుదుటి బొట్టు. మూడు అడ్డగీతలు మధ్యలో చుక్క. గోత్ర జంతువు ఎద్దు.  
ఖడ్గమృగం: నిలువు గీత నాల్గవ గోట్టు సనపగాని వంశం నుదుటి బొట్టును తెలియజేస్తుంది. వీళ్ల గోత్ర జంతువు ఖడ్గమృగం.
త్రిశూలం, ఒంటికొమ్ము దుప్పి: త్రిశూలం ఐదో గొట్టు రాయి బండానీ వంశం నుదుటి బొట్టును తెలియజేస్తుంది. వీళ్ల గోత్ర పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి.
మనుబోతు: నెలవంకలో చుక్క ఏడో గొట్టు పారేడు గట్టు వంశం నుదుటి బొట్టును తెలుపుతుంది. వీళ్ల గోత్రం పూజిత జంతువు మనుబోతు.
సింహం: వడ్డే గోత్రాన్ని తెలియజేస్తుంది. ఎక్స్ ఆకారం పసుపు కుంకుమ బొట్టు లేకుండా దేవుడు గుట్ట దిగిరాడని తెలుపుతుంది. వీరి గోత్ర పూజిత జంతువు సింహం.
జింక: కోయలు  జింకను సారలమ్మ ఆరాధ్య దైవంగా భావిస్తారు. 
సూర్యచంద్రులు: సూర్యచంద్రులు సృష్టిని నడుపించే  దైవంగా కొలుస్తారు.
కల కోడి, కలక తామరపువ్వు: ఈ సృష్టి మూలం నీటి నుంచి మొదలైందని తెలుపుతుంది. ఈ బొమ్మను ప్రధాన ద్వారంలో ఇరువైపులా, ఇతర అన్ని ద్వారాలపై ఉంటుంది.