నేటి యువతకు, వ్యాపారంలో అద్భుతాలు సృష్టించాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలకు ఒక గొప్ప ఉదాహరణ నితిన్ కల్రా. బట్టలు ఉతకడం, టేబుల్స్ శుభ్రం చేయడం వంటి అతి సాధారణ పనితో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా రూ.120 కోట్ల విలువైన స్నాక్స్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. సంకల్పంతో పాటు మార్కెట్‌పై లోతైన అవగాహన ఉంటే సాధారణ ప్రారంభం నుంచి కూడా అసాధారణ విజయాన్ని అందుకోవచ్చని నితిన్ కల్రా ప్రయాణం చెబుతోంది.
నితిన్ కల్రా ప్రయాణం చాలా మంది విద్యార్థుల మాదిరిగానే చాలా నిరాడంబరంగా మొదలైంది. కాలేజీలో చదువుతున్న రోజుల్లో పాకెట్ మనీ కోసం మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసేవారు. మెక్‌డొనాల్డ్స్‌లో టేబుళ్లు, వాష్‌రూమ్‌లు శుభ్రం చేసేవాడిని, గంటకు రూ.20 సంపాదించేవాడినని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ అనుభవం కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాదని, ఆహార పరిశ్రమ గురించి తనకు పాఠశాలగా మారిందన్నారు.
దాదాపు10 పాటు ప్రముఖ ఫుడ్ కంపెనీల్లో పనిచేస్తూ, మార్కెట్‌ను నిశితంగా పరిశీలించారు. షెల్ఫుల్లో ఉప్పు, నూనెతో నిండిన ఫ్రైడ్ స్నాక్స్ మాత్రమే ఎక్కువగా ఉండటం చూసి హెల్తీ స్నాక్స్ కోరుకునే వారికి అందుబాటులో ఆప్షన్స్ లేవని గుర్తించాడు. దీనిని పూడ్చలనే లక్ష్యంతో సొంత వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. దీంతో ఏటా రూ.కోటి జీతంతో వస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 2021లో రెడీ-టు-ఈట్ పానీపూరీ ఉత్పత్తి తీసుకురాగా అది పెద్ద హిట్ అయ్యింది. ఈ విజయం ఆయనకు 'షార్క్ ట్యాంక్ ఇండియా' మొదటి సీజన్‌లో చోటు సంపాదించి పెట్టింది. అక్కడ ఆయన పెట్టుబడితో పాటు ప్రముఖుల నుంచి విలువైన సూచనలు కూడా దక్కాయి. దీని తర్వాత ఆయన 'లెట్స్ ట్రై' బ్రాండ్ పుంజుకుంది.
ఇప్పుడు 'లెట్స్ ట్రై'.. నమ్‌కీన్స్, మఖానా, బిస్కెట్స్, కుకీలు వంటి 50కి పైగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను అందిస్తోంది. తమ ఉత్పత్తుల వల్ల వినియోగదారులకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా ఉండాలన్నదే తమ ఫిలాసఫీ అంటున్నారు ఈ వ్యాపారవేత్త. కేవలం నాలుగేళ్లలో, నితిన్ కల్రా 'లెట్స్ ట్రై'ని రూ.120 కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపారంగా ఎదిగింది. అయితే సక్సెస్ అంత ఈజీ కాదని వదలకుండా ముందుకు సాగితేనే విజయం దక్కుతుందని నేటి యువ వ్యాపారవేత్తలకు ఆయన సూచిస్తున్నారు.
