- కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా వందేమాతరం గేయాన్ని మజ్లిస్ నేతలు అవమానించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ వేదికగా దేశభక్తి గేయానికి అవమానం జరుగుతుంటే స్పీకర్, ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల రిలీజ్ చేశారు. ‘స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారనే విషయం మర్చిపోయారా..? వందేమాతరం ఆలపించేటప్పుడు సభ్యులంతా లేచి నిలబడి గౌరవించాలనే కనీస అవగాహన లేదా..?’ అని పేర్కొన్నారు.
గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్ సాక్షిగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తూ వాకౌట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గేయం ఆలపించాలని తప్పనిసరి చేస్తూ 2026లోనే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు మజ్లిస్ దోస్త్ .. కాబట్టే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి భయపడుతోందని విమర్శించారు. వందేమాతరాన్ని అవమానించిన మజ్లిస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
