మా వాళ్లే హైకమాండ్ కు తప్పుడు ఫిర్యాదు చేశారు : బండి సంజయ్

మా వాళ్లే హైకమాండ్ కు తప్పుడు ఫిర్యాదు చేశారు : బండి సంజయ్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నాయకులు ముఖ్యం కాదు.. కార్యకర్తలు, పార్టీ సింబలే ముఖ్యమన్నారు బండి సంజయ్. తాను, ప్రధానమంత్రి మోడీ పోలింగ్ బూతుల్లోకి వెళ్లి ప్రచారం చేయలేదని, కార్యకర్తలు, నాయకులే వెళ్లి ప్రచారం చేయడం వల్లే తామంతా గెలిచామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడడం వల్లే తాము గెలిచామన్నారు. 

మరోవైపు..ఇదే సభలో తన ఆవేదనను వ్యక్త పరిచారు బండి సంజయ్. తాను తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనపై కొందరు పార్టీ నేతలు అధిష్టానం పెద్దల వద్ద తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాపై ఫిర్యాదు చేస్తే చేశారు కానీ.. కార్యకర్తలు ఒక సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం కష్టపడి పని చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని చాలామంది నాయకులు నమ్ముతున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల లక్ష్యాన్ని ఫిర్యాదుల ద్వారా నాశనం చేయకండి. ఢిల్లీ పెద్దలకు తప్పుడు రిపోర్టులు ఇవ్వడం బంద్ చేయండి. ఢిల్లీకి వెళ్లి తప్పుడు రిపోర్టులు ఇవ్వకండి. కనీసం కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనీవ్వండి. కిషన్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పని చేసే నాయకుడు’’ అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఎవర్నీ ఉద్దేశించి ఇలా మాట్లాడి ఉంటారని అందరూ చర్చించుకుంటున్నారు. 

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి అసలే రావన్నారు. తప్పుడు వార్తలను, ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. తాను బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ర్ట ప్రభుత్వంపై చేసిన ఆందోళనలు, నిరసనలతో పాటు పార్టీ బలోపేతం కోసం చేసిన కృషితో తనకు చాలా తృప్తిగా ఉందన్నారు. తాను కష్టపడి పని చేశాననే తృప్తి ఉందని చెప్పారు. చాలామంది కార్యకర్తలు, నాయకులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని, కొందరు జైళ్లకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. తాను ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినప్పుడు యాత్రలో పాల్గొన్న బీజేపీ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తమ ఇబ్బందులను ఏనాడు చెప్పుకోలేదన్నారు. 

పాతబస్తీలో ఉండే బీజేపీ కార్యకర్తలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు నిజమైన హీరోలు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడైనా భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద  కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టిందా..? అని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బీజేపీ పార్టీ మీటింగ్ పెట్టిందన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా పోరాడామని చెప్పారు. రాబోయే రోజుల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు కమిట్ మెంట్ తగ్గకుండా మరింత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే  ఎన్నికల్లో తెలంగాణలో మోడీ రాజ్యం, రామరాజ్యం వస్తుందన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో అందరం కలిసి ముందుకెళ్తామని వ్యాఖ్యానించారు. 

కిషన్ రెడ్డిపై ప్రశంసలు జల్లు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనపై బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటూ బీజేపీ పార్టీ సిద్దాంతం కోసం కిషన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకూ అనేక గొప్ప పదవులు చేపట్టిన గొప్ప వ్యక్తి కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు.