సీఎం కుర్చీ ఎక్కి దళితులను మోసం చేసిండు

సీఎం కుర్చీ ఎక్కి దళితులను మోసం చేసిండు

హైదరాబాద్, వెలుగు: “కేసీఆర్ సీఎం పదవి చేపట్టినంక ఫస్ట్ మోసం చేసింది దళితులనే. తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తానని.. ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పిండు. తానే సీఎం కుర్చీలో కూర్చుని దళితులను దారుణంగా మోసం చేసిండు’’ అని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దళిత సీఎం హామీపై కేసీఆర్ ను నిలదీసినందుకే.. జనం దృష్టిని మళ్లించేందుకు మూడెకరాల భూమి అని మాయమాటలు చెప్పారని విమర్శించారు. దళితులకు భూమి  పంపిణీ చేయకపోగా.. వాళ్ల అసైన్డ్ భూములను లాక్కున్న చరిత్ర కేసీఆర్ దని మండిపడ్డారు. ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనుల పరిశీలన తరువాత సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆరేండ్లయినా విగ్రహం పనులు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా హాజరు కాని సీఎం.. కేసీఆర్ ఒక్కరే ఉన్నారన్నారు. విగ్రహం కోసం నాలుగేండ్ల తర్వాత రూ. 146 కోట్లు విడుదల చేశారని, కానీ ఇప్పుడు వెళ్లి చూస్తే.. 45 అడుగులకు మించి విగ్రహాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కన్పించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను గాలికొదిలేశారని, దళిత బంధు పథకాన్నీ అమలు చేయడంలేదని విమర్శించారు. చివరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.