స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు

స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు
  • అవి లగ్జరీ కార్ల స్కామ్​ నిందితుడు బసరత్​ ఖాన్​ దిగుమతి చేసినవే
  • కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్​
  • స్కామ్​లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండొచ్చు
  • వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరగాలని ట్వీట్
  • హైదరాబాద్​కు చెందిన బసరత్​ ఖాన్​ను మే 16న అరెస్ట్ చేసిన డీఆర్​ఐ

కరీంనగర్/హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. లగ్జరీ కార్ల స్కామ్​ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్​ క్రూజర్లలో కేటీఆర్​ ఎందుకు తిరుగుతున్నారని, స్కామ్​లో కేసీఆర్​ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అనుమానించాల్సి వస్తున్నదని సోమవారం ‘ఎక్స్’​ వేదికగా ఆయన తెలిపారు.

‘‘అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై కారు పార్టీ నడుస్తున్నదా? లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్​ దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా? లేదా తక్కువగా చూపించి కొనుగోలు చేయడం జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా? నకిలీ ఆదాయమా? లేదా మనీ లాండరింగ్ ద్వారానా? ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అనుమానించాల్సి వస్తున్నది” అని బండి సంజయ్​ పేర్కొన్నారు. వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని, సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు ట్వీట్​లో ఆయన తెలిపారు.

ఎవరీ బసరత్ ఖాన్..?
రూ. 100 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో హైదరాబాద్​కు చెందిన లగ్జరీ కార్ల డీలర్, గచ్చిబౌలిలోని ‘హైదరాబాద్ కార్ లాంజ్’ ఓనర్ బసరత్ ఖాన్ ను అహ్మదాబాద్​లో మే 16న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) ఆఫీసర్లు అరెస్టు చేశారు. హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ప్రీమియం మోడళ్లతోపాటు 30కి పైగా లగ్జరీ వాహనాలను ఈయన దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బసరత్​ ఖాన్​.. అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లను తెప్పించుకుని శ్రీలంక లేదా దుబాయ్ ద్వారా భారతదేశానికి మళ్లిస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు.

అమెరికా, జపాన్​లో అక్కడి అవసరాల మేరకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను ఉత్పత్తి చేస్తుంటారు. అందుకే వాటిని దుబాయ్, శ్రీలంకకు తీసుకొచ్చాక.. లెఫ్ట్ సైడ్ డ్రైవ్ నుంచి మన దేశ డ్రైవింగ్ విధానానికి తగ్గట్టు రైట్ హ్యాండ్ డ్రైవ్ కు మోడిఫై చేసి నకిలీ పత్రాలతో ఇండియాకు దిగుమతి చేసుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో  కస్టమ్స్ ట్యాక్స్​ను తప్పించుకునేందుకు లగ్జరీ వెహికల్స్​ను వాటి అసలు విలువలో దాదాపు 50 శాతానికిపైగా తక్కువగా అంచనా వేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.