- రైతులకు క్షమాపణ చెప్పి.. పంటల పరిశీలనకు రావాలి: బండి సంజయ్
- పదేండ్ల పాలనలో ఏనాడూ రైతులను కేసీఆర్ పట్టించుకోలే
- వడ్ల కుప్పలపై ప్రాణాలు పోయినా పరామర్శించలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు అధికారంలో ఉండి.. రైతులను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్‌కు వస్తున్నాడో చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రైతులు అసహ్యించుకుంటారనే సోయి కూడా లేకుండా.. ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొం దేందుకు రైతులపట్ల మొసలి కన్నీరు కార్చడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కు నిజంగా జ్ఞానోదయం అయితే.. రైతులపట్ల చిత్తుశుద్ధి ఉంటే.. రాష్ట్రంలో రైతుల ప్రస్తుత దుస్థితికి తానే కారణమని ఒప్పుకొని.. ముక్కు నేలకు రాసి.. బహిరంగ క్షమాపణ చెప్పి కరీంనగర్ కు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కేసీఆర్ హయాంలో.. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో దాదాపు 30 లక్షల ఎకరాల్లో తీవ్ర పంటనష్టం జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెప్పాయి. కానీ, ఏనాడూ రైతులను కేసీఆర్ ఆదుకోలేదు. అప్పులు పుట్టక కొందరు, వడ్లు కొనే నాథుడు లేక వడ్ల కుప్పలపైనే రైతులు గుండెలు పగిలి చనిపోతుంటే కనీసం పరామర్శించలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని పంటల పరిశీలనకు రావడాన్ని ప్రజలు ఏ విధంగా అర్ధం చేసుకోవాలి”అని
సంజయ్ ప్రశ్నించారు.
11 వేల మంది రైతులు సూసైడ్చేసుకున్నరు
రాష్ట్రంలో వరి పంట పండిస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించకుండా.. వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ చేసిన బెదిరింపులకు భయపడి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సంజయ్అన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వ్యవసాయం రంగం నిజంగా అభివృద్ధి చెందితే.. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మందికి పైగా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పా లన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులను బీఆర్ఎస్ పార్టీ అరిగోస పెడితే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని ఫైర్అయ్యారు.