- అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీస్తున్నారా?: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దలకు, ఫాంహౌస్కు మధ్య ఇంకా డీల్ కుదరనందుకే ఈ కేసును సాగదీస్తున్నారా అని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారులైన తండ్రీకొడుకులను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. ట్యాపింగ్ పాపం వారిదేనని తెలిసినా.. ఇప్పటివరకు ఒక్క పొలిటికల్ లీడర్‌ను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు.
గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని హరీశ్ రావు గగ్గోలు పెట్టిన విషయం, భయంతో ఆయన చాలా రోజులు ఫోన్ మాట్లాడని విషయం ప్రభుత్వానికి తెలియదా అని సంజయ్ ప్రశ్నించారు. రెండేండ్లుగా సాగుతున్న విచారణ తీరు ‘కర్ర విరగదు.. పాము చావదు’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సిట్ దర్యాప్తును చూసి జనం నవ్వుకుంటున్నారని, కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, దమ్ము ఉంటే కాలయాపన చేయకుండా వెంటనే ట్యాపింగ్ సూత్రధారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
