బీసీని సీఎం చేస్తామనగానే.. గుణం గుర్తుకొచ్చిందా?: సంజయ్​

బీసీని సీఎం చేస్తామనగానే.. గుణం గుర్తుకొచ్చిందా?:  సంజయ్​
  • కేటీఆర్​.. బీఆర్ఎస్​లో ఎంతమంది గుణవంతులకు టికెట్లు ఇచ్చారో చెప్పు: సంజయ్​
  • బీసీలను అవమానించినందుకు కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి 
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కయినయని కామెంట్​

కరీంనగర్, వెలుగు: అధికారంలోకి రాగానే ‘బీసీ’ని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​షా ప్రకటించగానే.. మంత్రి కేటీఆర్​కులం కాదు.. గుణం ముఖ్యమని అంటున్నారని, గుణమే ముఖ్యమంటున్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ డిమాండ్​చేశారు. కేటీఆర్ తన వ్యాఖ్యలతో బీసీ వర్గాలను దారుణంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్స్ లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ విస్త్రతస్థాయి లీడర్ల సమావేశానికి బండి సంజయ్ హాజరై మాట్లాడారు. మంత్రి కామెంట్స్ ను బీసీ ప్రజలతోపాటు పేదలంతా సీరియస్ గా తీసుకోవాలన్నారు. కొడుకు చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయా వర్గాల ప్రజలను ఓట్లు అడగాలన్నారు. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్ ను మామ అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘ఈ మామ అల్లుళ్ల పంచాయితీ ఏంది? ఈ కొత్త వరుసలేంది? ఎన్నికల రాంగనే మామ, అల్లుళ్లు, బావ బామ్మర్థులైతున్నరు. ఎన్నికలకు ముందు అన్నదమ్ములనుకున్నరు. ఇప్పుడు మామ, అల్లుళ్లు అవుతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి వావి వరసల్లేకుండా అక్రమ వరసలు కలుపుకునే సిగ్గులేని పార్టీలవి. అసలు మామ ఎట్లా అవుతాడు? దీని వెనుక కథేంది. మామా అల్లుళ్ల పంచాయితీ తేల్చాలి. రాజకీయ వ్యభిచార సంబంధాల గురించి మాట్లాడాలి’ అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుమ్కక్కై బీజేపీ గ్రాఫ్ ను తగ్గించే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోరాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు అనేక సార్లు కలిసి పనిచేశాయన్నారు. 

కేసీఆర్ పంజరంలో కాంగ్రెస్ బందీగా మారిందని, కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారని ఆరోపించారు. కేసీఆరే స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారని, వాళ్లు గెలవగానే బీఆర్ఎస్ లోకి రాబోతున్నారని తెలిపారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని బండి సంజయ్​ చెప్పారు. ‘ఏయ్ బండి సంజయ్... పాతబస్తీలో సభ పెట్టాలనే ఆలోచన విరమించుకోకుంటే నీ భార్య తల నరికి నీకు గిఫ్ట్ గా ఇస్తాం. నీ ఇద్దరి కొడుకులను కిడ్నాప్ చేస్తాం’ అంటూ బెదిరించారని  గుర్తు చేశారు. ఇదే విషయాన్ని తన భార్యకు చెబితే ‘ప్రాణం పోయినా ఫర్వాలేదు.. వాళ్ల బెదిరింపులకు లొంగొద్దు. పాతబస్తీలో సభ పెట్టండి. బీజేపీ సత్తా చాటండి’ అని ధైర్యం ఇచ్చిందన్నారు.