కేసీఆర్​కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు: బండి సంజయ్

కేసీఆర్​కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు: బండి సంజయ్
  • ఇక రీ ఎంట్రీ కలే: కేంద్రమంత్రి బండి సంజయ్
  • వరదలతో జనం అల్లాడుతున్నా కేసీఆర్ బయటకు రాలే
  • ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ 'హైడ్రా'మా 
  • ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే 
  • రాహుల్​కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: ప్రజలు కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని.. ఆయన తిరిగి అధికారంలోకి రావడం కలనేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వేయాల్సిన ఓట్లు పొరపాటున కాంగ్రెస్ కు వేశారన్నారు. కేసీఆర్ అరాచక పాలన గురించి చెప్పనక్కర్లేదని, ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి, రౌడీషీట్లు పెట్టి వేధించారని ఆయన మండిపడ్డారు. తనపై 109 కేసులు పెట్టించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని, దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు. బుధవారం గచ్చిబౌలి ఎస్సార్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంజయ్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పారు. 

2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని, అంతకుముందు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు వంద శాతం మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం గోడదూకే పార్టీ అని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నదని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఒక్కటై పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఒవైసీ ఒక్కటై పోటీ చేసినా.. బీజేపీ ఎదుర్కోవడమే కాకుండా గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా దేశంలోని పార్టీలన్నీ కుటుంబ, వారసత్వ, అవినీతి పార్టీలేనన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు క్యాడర్ ఉంది గానీ, ఓటర్లు లేరని చెప్పారు. జాతీయవాద భావాలున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. చైనాలోని నియంత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని అధిగమించి రికార్డు సృష్టించిన పార్టీ బీజేపీ అని చెప్పారు. 

విదేశాల్లో దేశం పరువుతీస్తున్న రాహుల్

విదేశాల్లో పర్యటిస్తూ భారత్ ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని బండి సంజయ్ మండిపడ్డారు. విదేశాల్లో దేశం పరువు తీస్తున్నారని ఆరోపించారు. ‘‘రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తడనుకున్న. కానీ, రేవంత్ తో సాధ్యం కావట్లేదు. కేసీఆర్ ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చిండు”అని ఆరోపించారు. అదే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కుటుంబం అంతు చూసేటోళ్లమని, అంకుశం సినిమాలో రాంరెడ్డిని ఎట్లా గుంజుకపోయి జైల్లో వేశారో.. అట్లనే కేసీఆర్ కుటుంబాన్ని గుంజుకపోయి జైల్లో వేసేటోళ్లమని చెప్పారు. చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కూన రవికుమార్ పాల్గొన్నారు.