రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల భూములపై కన్ను: సంజయ్ 

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల భూములపై కన్ను: సంజయ్ 

 

  • ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబానికి పరామర్శ 
  • రైతులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ ముట్టడి  
  • అడ్డుకున్న పోలీసులు.. గంట పాటు ఉద్రిక్తత.. కొందరికి గాయాలు 
  • సంజయ్​ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్​కు తరలింపు   

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులకు రాష్ట్ర సర్కార్ అన్యాయం చేస్తోందని, అందుకే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిందని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ మండిపడ్డారు. ‘‘ఇన్నేండ్లు దందాలు, స్కామ్​లు చేసి బాగా సంపాదించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు భూముల మీద పడ్డారు. పంటలు పండే భూముల్ని ఇండస్ర్టియల్​జోన్లుగా మారుస్తున్నారు. ఆ భూములను మళ్లీ  బీఆర్ఎస్ లీడర్లే కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు కామారెడ్డిలోనూ అలాగే చేసేందుకు కుట్ర పన్నారు” అని ఆయన ఆరోపించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న ఆందోళనతో సదాశివనగర్​మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా.. ఆయన కుటుంబాన్ని సంజయ్ శుక్రవారం పరామర్శించారు. మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపి మీడియాతో మాట్లాడారు. అనంతరం రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు, బీజేపీ కార్యకర్తలు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. 

నెల రోజులైనా ఎందుకు స్పందించలే.. 

అంతకుముందు సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ పాలనలో రైతులు చితికిపోతున్నారు. ఇక్కడి రైతులను పట్టించుకోని కేసీఆర్..​ బీఆర్ఎస్ పెట్టి కిసాన్​ సర్కార్​ తెస్తానని బయలుదేరారు” అని సంజయ్ విమర్శించారు. కామారెడ్డి రైతులకు రాష్ట్ర రైతులందరూ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ‘‘రైతు చనిపోతే ఒకాయన చనిపోయాడట కదా! అంటూ కేటీఆర్ వెటకారంగా మాట్లాడారు. రైతు చనిపోతే చావు కాదా?” అని ప్రశ్నించారు. కొందరు కలెక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. ఉద్యోగం చేయడం చేతకాకపోతే బీఆర్ఎస్​ కండువా కప్పుకొని రాజకీయం చేయాలని మండిపడ్డారు. ‘‘కామారెడ్డి మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా నెల రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తుంటే కలెక్టర్ ఎందుకు స్పందించలేదు. రైతులతో ఎందుకు చర్చించలేదు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే రాములు ఆత్మహత్య చేసుకున్నాడు” అని అన్నారు. కామారెడ్డి డీఎస్పీ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగాఉందని ఫైర్ అయ్యారు. మాస్టర్ ప్లాన్​తో దాదాపు 4 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి అండగా ఉంటామని, మాస్టర్ ప్లాన్​ను రద్దు చేసేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇండస్ట్రియల్ జోన్​కు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ దాని కోసం ఏడాదికి రెండు పంటలు పండే భూములను 
లాక్కోవడం సరికాదన్నారు. 

కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. 

మీడియాతో మాట్లాడిన తర్వాత తాను ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్నానని.. సర్కార్ దిగొచ్చే వరకు అక్కడే బైఠాయిస్తానని సంజయ్ చెప్పారు. రైతులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడ్లూర్ రోడ్డులోనే అడ్డుకునేందుకు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేయగా, వాటిని తోసేసి వందలాది మంది కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.  పలుమార్లు జరిగిన తోపులాటలో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి కిందపడిపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంజయ్​ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెహికల్​లోకి ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మరోసారి తోపులాట జరిగింది. పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ ని హైదరాబాద్​కు తరలించారు. ఆందోళనలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార,  మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, కామారెడ్డి నియోజక వర్గ ఇన్​చార్జ్ వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సంజయ్​కి వివేక్ ఫోన్  

సంజయ్​కి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఫోన్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా, పోలీసులు వ్యవహరించిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయమై బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్‌‌‌‌‌‌‌‌ కూడా సంజయ్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. 

బంద్ సక్సెస్..    

మాస్టర్ ప్లాన్​కు వ్యతిరేకంగా, కలెక్టర్​ తీరుకు నిరసనగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన కామారెడ్డి బంద్ సక్సెస్​అయింది. పట్టణంలోని దుకాణాలు, సినిమా హాల్స్, హోటళ్లు, ప్రైవేట్​విద్యాసంస్థలను మూసేశారు. బంద్​కు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాయి. పట్టణ శివార్లలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన పోలీసులు.. వివిధ గ్రామాల నుంచి కామారెడ్డికి వస్తున్న రైతులు, బీజేపీ, కాంగ్రెస్ ​లీడర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు మున్సిపల్​ఆఫీసును ముట్టడించారు. కలెక్టరేట్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో రవీందర్​రెడ్డి అంగీ చినిగిపోయింది. కాంగ్రెస్ నేత షబ్బీర్​అలీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై ధర్నా చేశారు. మాస్టర్ ​ప్లాన్ ​రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ కలెక్టర్​కు వినతి పత్రం ఇచ్చారు. బంద్​ సందర్భంగా రైతులు, బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన 170 మంది నేతలను అరెస్టు చేశారు.