
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
- కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ మేడిగడ్డకే పరిమితమా?
- అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతున్నదని ప్రశ్న
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే మాజీ మంత్రి కేటీఆర్ ను బొక్కలో వేసి ఊచలు లెక్కించేలా చేసేవాళ్లమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భావనతో కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ సహా ఆ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని ధ్వజమెత్తారు. కరీంనగర్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం కోసం కేసీఆర్ రక్తం చిందించారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. ‘మీ అయ్య ఒంట్లో ఉన్నదంతా మద్యమే. రోజూ ఫుల్ బాటిల్ దంచుతుండే. ఏనాడూ ప్రగతి భవన్, ఫామ్‌హౌజ్ దాటి రాలే. ఇగ రక్తం చిందించింది ఎప్పుడు?’ అని ఎద్దేవా చేశారు. ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం రక్తం చిందించింది బీజేపీ కార్యకర్తలేనన్నారు.
‘ధాన్యం కొనేటోడు లేక రైతులు కల్లాల దగ్గర నానా కష్టాలు పడుతుంటే.. మేం నల్గొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వెళితే పోలీసులతో కొట్టించారు. బీఆర్ఎస్ గూండాలతో రాళ్ల దాడి చేయించారు. అప్పుడు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులు అల్లాడుతుంటే వాళ్ల పక్షాన పోరాడిన బీజేపీ కార్యకర్తలను లాఠీలతో కొట్టించి రక్తం చిందేలా చేశారు. 317 జీవో సవరణ కోసం ఉద్యోగుల పక్షాన పోరాడితే కొట్టించి జైల్లో వేశారు. ఆర్టీసీ, ఇంటర్ విద్యార్థుల పక్షాన పోరాడితే రక్తం చిందేలా కొట్టించారు.
లాఠీ దెబ్బలు, రాళ్ల దెబ్బలు తిన్నది మేం. జైళ్లకు పోయింది మేం. రక్తాన్ని చిందించింది మేం. మరి కేసీఆర్ రక్తం చిందించింది ఎక్కడ?’ అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణను మేడిగడ్డకే పరిమితం చేస్తారనే అనుమానం కలుగుతున్నదన్నారు. కేసీఆర్ కుటుంబ అరాచకాలు, అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నదో అర్థం కావడం లేదన్నారు. అవినీతికి పాల్పడకుండా కేసీఆర్ కుటుంబం ఒక్కటంటే ఒక్క పని అయినా చేసిందా? అని సంజయ్ విమర్శించారు.