జనసేనతో పొత్తుపై హైకమాండ్​దే తుది నిర్ణయం

జనసేనతో పొత్తుపై హైకమాండ్​దే తుది నిర్ణయం
  • బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తున్నది: బండి సంజయ్
  • బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వడం లేదు
  • కాంగ్రెస్ నియోజకవర్గాలకే ఫండ్స్ ఇస్తున్నరని ఫైర్

కరీంనగర్, వెలుగు: తెలంగాణలో జనసేనతో పొత్తుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచారని తెలిపారు. దీనిపై జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తాను చెప్తేనో.. ఇంకొకరు చెప్తేనో.. పొత్తుపై నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదన్నారు. ఆదివారం ఉదయం కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే అభివృద్ధి నిధులు ఇస్తున్నదని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వడం లేదని మండిపడ్డారు. ఫండ్స్ ఇవ్వకుంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే భావనతో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, తాము కూడా అలాగే చేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టీ 20 ప్రపంచ కప్ లో ఇండియా విజయం సాధించడం సంతోషకరమన్నారు. 

కమీషన్లు తీసుకుంటే కఠిన చర్యలు

పీఎం విశ్వకర్మ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారీ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు మహిళలు బండి సంజయ్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం లబ్దిదారులుగా ఎంపిక చేస్తామంటూ కొంత మంది దళారులు కమీషన్లు దండుకుంటున్నారంటూ మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సంజయ్​... ఇప్పటికే ఈ అంశంపై కలెక్టర్ రివ్యూ చేశారని తెలిపారు. కలెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్నారు. పీఎం విశ్వకర్మ లబ్దిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అనంతరం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో పార్టీ నాయకులతో కలిసి 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని చూశారు.