
మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. మీరు మార్వాడీ గో బ్యాక్ అంటే మేం రోహింగ్యాలు గో బ్యాక్ అంటూ ఆందోళన చేస్తామని అన్నారు. శుక్రవారం (ఆగస్టు 15) హైదరాబాద్ యూసుఫ్ గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్.రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు. తెలంగాణను దోచుకోలేదు. వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారు. జీడీపీ పెంపులో వారి పాత్ర చాలా ఉంది. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు. అట్లాంటి మర్వాడీలు తెలంగాణ నుండి ఎందుకు వెళ్లిపోవాలి?అని ప్రశ్నించారు. మర్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని అన్నారు.
►ALSO READ | రంగారెడ్డి జిల్లాలో BRS కు బిగ్ షాక్.. కీలక నేతతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరిక
ఈ సందర్భంగా కాంగ్రెస్ తెరపైకి తెచ్చిన ఓట్ల చోరీ గురించి మాట్లాడారు బండి సంజయ్. ఓట్లను తొలగించేది, చేర్చేది ఎన్నికల సంఘం పని. ఓట్లకు బీజేపీకి సంబంధం ఏముంది? ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. నిజంగా ఓట్ల చోరీ మా చేతుల్లో ఉంటే మాకు 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? అన్ని సీట్లలో గెలిచేవాళ్లం కదా? తెలంగాణ, కర్నాటకలో బీజేపీయే అధికారంలోకి వచ్చేది కదా? రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ఓట్ల చోరీ చేసే కాంగ్రెస్ గెలిచిందా? అని ప్రశ్నించారు. ఓట్ల చోరీ చేసే కర్నాటకలో గెలిచిందా? ఓట్ల చోరీ చేసే ఇండీ కూటమి 230 ఎంపీ సీట్లను గెలుచుకుందా? మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం.. ఓడిపోతే ఓట్ల చోరీ జరిగినట్లా? వాళ్లు చేస్తే సంసారం... మేం చేస్తే వ్యభిచారమా? ఇదేం పద్దతి?.. అని ప్రశ్నించారు.