
- టీఆర్ఎస్కు త్వరలోనే గుణపాఠం చెప్తం: బండి సంజయ్
- బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదని సీఎం అంటున్నారని.. ప్రజలు కూడా కేసీఆర్ లేని తెలంగాణ కావాలని కోరుకుంటున్నరని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రం సంఘ విద్రోహులకు అడ్డాగా మారిందని, ఇందుకు ఆదిలాబాద్ కాల్పుల ఘటనే ఉదాహరణ అని ఆరోపించారు. గూండాలకు తుపాకులు ఎవరు ఇస్తున్నారని.. ఈ ఘటనలపై సీఎం, హోంమంత్రి ఎందుకు స్పందించరని నిలదీశారు. కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ నేత గుగ్గిళ్లపు రమేశ్ శనివారం సాయంత్రం సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. పాతబస్తీలో మజ్లిస్ గూండాలు దేవాలయ భూములను కబ్జా చేస్తున్నారని.. దానిని అడ్డుకోవాలని కోరే హిందువులను అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు సీఎం కేసీఆర్ ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శక్తివంతమైన పోలీసు వ్యవస్థ ఉందని, కానీ కేసీఆర్ సర్కారు పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో నిరుద్యోగికి 72 వేల రూపాయలు బకాయి ఉన్నాడన్నారు. పొర్లుదండాలు పెట్టినా కేసీఆర్ ను వదలబోమని, టైమొచ్చినప్పుడు విచారణ జరిపి జైల్లో పెడ్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ కు త్వరలోనే గుణపాఠం చెప్తామని, బీజేపీని అధికారంలోకి తెస్తామని చెప్పారు.
ఫాంహౌస్ నుంచి బయటికి ఎందుకు రావట్లే..
సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ లో ఏదో నిధి దాచారని.. అందుకే దాన్ని విడిచి బయటికి రావడం లేదని సంజయ్ కామెంట్ చేశారు. డీజీపీ వెంటనే ఫాంహౌస్‌ను తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండటం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యకు కేసీఆరే బాధ్యుడని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లపై దాడులకు దిగుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చెంచాగిరీ చేసే రిటైర్డ్ ఆఫీసర్లకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కారు ఎక్కడ ఖర్చు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతులు పంట నష్టపోతే ఆదుకునే ఫసల్ బీమాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించడం లేదని చెప్పారు.