కాళేశ్వరంతో జనాన్ని ముంచిండు

కాళేశ్వరంతో జనాన్ని ముంచిండు
  • ఇప్పుడు బస్వాపూర్​ వంతు వచ్చింది
  • ప్రాజెక్టుల పేరుతో రైతులను సీఎం ఏడిపిస్తున్నడు
  • పరిహారం అడిగితే గౌరవెల్లి నిర్వాసితులను రక్తం కారేట్లు కొట్టించిన దుర్మార్గుడు కేసీఆర్

బాధితులకు మార్కెట్​రేట్ల ప్రకారం పరిహారమియ్యాలె​

యాదాద్రి, వెలుగు : దుర్మార్గ పాలకుడైన కేసీఆర్ ను చూసి ఎవరూ భయపడవద్దని, ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యాదాద్రి జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భువనగరి మండలం బస్వాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు అధ్యక్షతన నిర్వహించిన రచ్చబండ, భువనగిరిలో నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శంకర్​దాదా ఎంబీబీఎస్​ లెక్క  సీఎం కేసీఆర్ డూప్​ ఇంజనీర్ అని ఆయన ఎద్దేవా చేశారు. ''కేసీఆర్​ దుర్మార్గుడు. అన్నీ తనకే తెలుసనుకుంటడు. ప్రజలను పట్టించుకోడు. శంకర్​దాదా ఎంబీబీఎస్​ లెక్క కమీషన్ల కోసం కేసీఆర్​ డూప్​ ఇంజనీర్​ అవతారమెత్తిండు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జనాన్ని నిండా ముంచిండు. ఇప్పుడు బస్వాపూర్​ వంతు వచ్చింది. ప్రాజెక్టుల పేరుతో రైతులను కేసీఆర్​ ఏడిపిస్తున్నడు”అని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు భూములు, ఇండ్లు కోల్పోయి బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం అడిగిన పాపానికి నిర్వాసితులపై లాఠీచార్జి చేసి రక్తం కారేట్లు కొట్టి జైల్లో వేశారని ఫైరయ్యారు. ఇప్పుడు బస్వాపూర్ లోనూ అదే పరిస్థితి కన్పిస్తోందని అన్నారు. తెలంగాణలో భూముల రేట్లు ఎకరానికి రూ.50 లక్షలకు పెరిగాయని, ఆ రేట్ల ప్రకారం బస్వాపురం నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని సర్కార్​ను ఆయన ప్రశ్నించారు. రిజర్వాయర్​ నిర్మాణం పేరుతో కమీషన్లు తీసుకున్న కేసీఆర్..​ అందులో కొంచెమైనా నిర్వాసితులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదని, ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని సంజయ్​చెప్పారు. 

ఓటుకు నోటు కేసు మాఫీ బాధ్యత తీసుకున్నడు

బీజేపీపై ఉన్న భయంతో సీఎం కేసీఆర్​ కాంగ్రెస్​తో అంటకాగుతున్నారని సంజయ్​ విమర్శించారు. అందులో భాగంగానే రేవంత్​రెడ్డి ఓటుకు నోటు కేసును మాఫీ చేయించే బాధ్యతను కేసీఆర్​తీసుకున్నారని ఆయన ఆరోపించారు. బస్వాపురం రిజర్వాయర్​ వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలు, మోడీ నాయకత్వం మీద నమ్మకంతో పార్టీ లోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, ప్రతి ఒక్కరికీ సముచితమైన స్థానం కల్పిస్తామని చెప్పారు. అనంతరం రైస్​ మిల్లర్లతో మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ  కార్యక్రమాల్లో పార్టీ నేతలు బూడిద భిక్షమయ్యగౌడ్, గూడూరు నారాయణరెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, సంగప్ప, రాణి రుద్రమ పాల్గొన్నారు.

బస్వాపురంలో రచ్చబండ

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్​ ప్రజలతో మమేకమై తిరిగారు. వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. బుధవారం ఆయన 10 కిలోమీటర్లు నడిచారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో రచ్చబండ కార్యక్రమంతో బుధవారం ప్రారంభమైంది. బస్వాపురం రిజర్వాయర్​ కారణంగా ముంపుకు గురవుతున్న  బీఎన్​ తిమ్మాపురం, బస్వాపురం గ్రామస్థులతో పాటు కొందరు టీఆర్​ఎస్​ కార్యకర్తలు, లీడర్లు కూడా రచ్చబండలో పాలు పంచుకున్నారు. గ్రామస్థుల బాధలు కష్టాలు విన్న సంజయ్.. నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా జిల్లాలోని వలిగొండ మండలం అర్రూర్​కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త  సీఎన్  రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన  వందలాది మంది కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో  బీజేపీలో చేరారు.

హిందూ ధర్మం జోలికొస్తే మెడలు వంచుతం

''హిందూ దేవుళ్లను కించపరిచే ఎంఐఎం పార్టీతో ఎందుకు చట్టపట్టా లేసుకొని తిరుగుతున్నావ్ కేసీఆర్? బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారి మెడలు వంచుతం’’ అని సంజయ్​ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడి, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు.

‘మునుగోడు’లో గెలుద్దాం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవడంతో.. మునుగోడు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో గెలుపుపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. పాదయాత్రలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర​అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం లంచ్ విరామ సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జీ మురళీధర్ రావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మునుగోడులో పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిపై రాష్ట్ర నాయకత్వం సర్వే చేసింది. ఈ రిపోర్టును కూడా హైకమాండ్ కు రాష్ట్ర పార్టీ పంపించింది. నియోజకవర్గానికి ఎన్నికల ఇన్​చార్జీగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని తిరిగి నియమించాలని రాష్ట్ర పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఆయనే ఇన్​చార్జీగా ఉన్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారిగా కూడా పార్టీ ఇన్​చార్జీలను నియమించడంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.