
- మా కార్యకర్తలను అనేకమందిని చంపించిండు: బండి సంజయ్
- కాంగ్రెస్, టీడీపీ నేతలనూ హతమార్చారని ఆరోపణలు
- గద్దర్ పేరిట ఇచ్చే అవార్డులూ తీసుకోబోమని కామెంట్
హైదరాబాద్, వెలుగు: గద్దర్ కు పద్మ అవార్డు ప్రకటించకపోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబులిటీ ఉన్న వ్యక్తుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదన్నారు. ‘‘పద్మ అవార్డులకు అర్హుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలి. గద్దర్ కు పద్మ అవార్డు ఎట్లా ఇస్తాం? ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపించారో తెలియదా? వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్..” అని బండి సంజయ్ ఆరోపించారు.
నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. గద్దర్ నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తి అని, నక్సల్స్ తమ పార్టీకి చెందిన అనేక మంది కార్యకర్తలను చంపారన్నారు. అనేక మంది పోలీసులను చంపించిన వారిలో గద్దర్ కూడా ఉన్నారన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటున్న గద్దర్ అవార్డులను కూడా తాము తీసుకోబోమని చెప్పారు. ‘‘మంత్రి శ్రీధర్ బాబు తండ్రిని, మాజీ మంత్రి డీకే అరుణ తండ్రిని చంపింది నక్సలైట్లు కాదా?’’ అని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలను కూడా గద్దర్ చంపించారని, ఆ విషయం రేవంత్ కు తెలియదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తోంది. సంక్షేమ పథకాలకు నిధులు ఇస్తోంది. కేంద్ర పథకాల పేర్లను మారిస్తే.. స్కీములన్నీ నేరుగా లబ్ధిదారులకే అందజేస్తాం” అని సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత పథకాలకు ఇందిరాగాంధీ పేరు కాకుంటే దావూద్ ఇబ్రహీం, బిన్ లాడెన్ పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదన్నారు. పేర్ల కోసం ఆరాటపడి ప్రజలను ఆగం చేయొద్దన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు.
కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలే..
గతంలో పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం 2.40 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే.. అప్పటి సీఎం కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రజలను రోడ్డున పడేశారని సంజయ్ విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని అన్నారు. కట్టిన కొన్ని డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో అవి కూలిపోయే స్థితిలో ఉన్నాయన్నారు.
ఇప్పుడు రేషన్ కార్డులు, ఇండ్లకు కూడా పైలెట్ ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇది14 శాతం కమీషన్ ప్రభుత్వమని ఆరోపించారు. కుటుంబ సభ్యులను ప్రభుత్వంలో ఇన్వాల్వ్ చేస్తున్నారని విమర్శించారు. కాగా, ఎంపీ ఈటల రాజేందర్ నక్సలైట్ కాదని, భావజాలం వేరు.. నక్సలైట్ గా పని చేయడం వేరని సంజయ్ కామెంట్ చేశారు. నక్సలిజంతో ఈటలకు సంబంధం లేదన్నారు.