బీజేపీ పార్టీ అంటే కేసీఆర్ కు భయం : బండి సంజయ్

బీజేపీ పార్టీ అంటే కేసీఆర్ కు భయం : బండి సంజయ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో కేసీఆర్ మూర్ఖత్వ పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆందోళనలు, నిరసనలు చేపట్టిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ కిషన్ రెడ్డి ఆధ్వర్వంలో రాష్ర్ట ప్రభుత్వంపై మరిన్ని పోరాటాలు, ఆందోళనలు, నిరసనలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ర్టంలో కుటుంబ పాలనను అంతమొందించాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. 

బీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు బండి సంజయ్. చివరకు కేంద్రం ఇచ్చిన ఇండ్లను కూడా ప్రజలకు ఇవ్వకుండా రాష్ర్ట ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కేంద్రం నిధులను రాష్ర్ట ప్రభుత్వం దారి మళ్లీస్తోందని చెప్పారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని పోలీసులతో దౌర్జాన్యంగా, నిరంకుశంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. బీజేపీ అంటే కేసీఆర్ కు భయమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేయడంలో విశ్రమించారని హెచ్చరించారు. 

రైతులకు రుణమాఫీ చేయాలన్నారు బండి సంజయ్. గత రెండు, మూడు రోజులుగా రాష్ర్టంలో భారీగా వర్షాలు పడుతుంటే కేసీఆర్ ఫాంహౌజ్, ప్రగతిభవన్ లో పడుకున్నారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు వేస్తారని చెప్పారు. ఈసారి కేసీఆర్ అధికారంలోకి రాడన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే కేసీఆర్ డ్రామాలు వేస్తారని చెప్పారు. 

కిషన్ రెడ్డిపై ప్రశంసలు జల్లు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనపై బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటూ బీజేపీ పార్టీ సిద్దాంతం కోసం కిషన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకూ అనేక గొప్ప పదవులు చేపట్టిన గొప్ప వ్యక్తి కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు.