- కాంగ్రెస్ పాలనలోనూ అదేతీరు.. మరి అప్పుడెందుకు రిజైన్చేయలే
- విద్యార్థుల ముసుగులో కమ్యూనల్, కమ్యూనిస్టు శక్తుల అరాచకం
- మోదీని దించడమే ఇండియా కూటమి ఏకైక లక్ష్యమని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత రేవంత్ రెడ్డి, గత బీఆర్ఎస్ పాలనలోనూ ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, ఆనాడు కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. జెన్ జీ పిల్లలంతా ఆ రెండు పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ పేరుతో జరిగిన నిరసనలో కమ్యూనిస్టు, కమ్యూనల్ పార్టీలు చొరబడి హింసను సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, పాల్వాయి హరీశ్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎంసెట్, టీఎస్పీఎస్సీ గ్రూప్-1, పదో తరగతి పేపర్లు ఇలా అన్నీ లీకయ్యాయని ఆరోపించారు. ధర్నా చౌక్‌నే ఎత్తేసిన బీఆర్ఎస్ నేతలు.. అక్కడికే వచ్చి నిరసనలు చేస్తున్నారని, వారిని చూసి ఇందిరా పార్క్, ఎన్టీఆర్ పార్క్ పగలబడి నవ్వుతున్నాయని ఎద్దేవా చేశారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, అందరికంటే ఎక్కువగా ప్రధాని మోదీ బాధపడుతున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఇప్పటికే క్షమాపణ చెప్పారని, విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించినట్టు తెలిపారు.
పార్లమెంట్‌పై దాడికి కుట్ర..
ఢిల్లీలో విద్యార్థుల ముసుగులో కొన్ని శక్తులు పార్లమెంట్‌పై దాడికి కుట్ర చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. 118 మంది పోలీసులు గాయపడితే తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు. నీట్ పేపర్ లీకై రెండు నెలలు దాటినా కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఏనాడూ పెదవి విప్పలెదని, కాక్రోచ్ పార్టీ ధర్నాలతో సడెన్‌గా పీఎం ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు.
కేవలం మోదీని దించి రాహుల్‌ను పీఎం చేయాలన్నదే వాళ్ల లక్ష్యమని పేర్కొన్నారు. నీట్ మస్యకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిష్కారం కాదని, విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమన్నారు. కాగా, కేటీఆర్‌కు 50వ బర్త్ డే సందర్భంగా సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ బతుకు ఫిఫ్టీ ఫిఫ్టీ అయ్యిందని విమర్శించారు. 50 శాతం గబ్బులు.. మరో 50 శాతం పబ్బులతోనే బతుకు గడుస్తోందని ఎద్దేవా చేశారు.
