పేదలకు భూములు లేవంటరు..జర్నలిస్టుల కేమో ఇస్తమంటరు :బండి సంజయ్  

పేదలకు భూములు లేవంటరు..జర్నలిస్టుల కేమో ఇస్తమంటరు :బండి సంజయ్  
  • సీఎం రేవంత్‌‌ మాటలు వింతగా ఉన్నాయన్న బండి సంజయ్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదలకు, దళితులకు, గిరిజనులకు పంచేందుకు భూమి కూడా లేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంతాల వారికి ఇస్తామనడం వింతగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎవరికి అవసరమో వారికి కాకుండా.. ఎవరితో లాభమో వారికే ఇస్తున్నారని సోమవారం ‘ఎక్స్’లో విమర్శించారు. ‘‘పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు అంటారు కానీ, ఒవైసీ ఒక్క మాట చెబితే మూసీ ప్రాజెక్టు కోసం రూ.వేల కోట్లు రెడీ అంటారు.

అంటే సామాన్యుల కడుపు నింపేదాని కంటే భారీ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఎక్కువైందా?’’అంటూ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడ్తుంటే, అవి కట్టకుండా ఈవీ స్కూటీలు ఇస్తామనడం వినడానికి బాగున్నా, అది అసలు సమస్యను పక్కదారి పట్టించడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి దోమల బెడద పెరిగిపోయిందని, మన పనిలో మనం ఉన్నా సరే, ఈ దోమల్లాగే ప్రభుత్వం కూడా జనాన్ని కుట్టి పరేస్తున్నదని ఎద్దేవా చేశారు.