కేటీఆర్, హరీశ్ కు ఈర్ష్య పీక్ లో ఉంది : బండ్ల గణేశ్

కేటీఆర్, హరీశ్ కు ఈర్ష్య పీక్ లో ఉంది : బండ్ల గణేశ్

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల పై సినీ నటుడు కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసూయ ద్వేషంతో కేటీఆర్, హరీష్ మాట్లాడుతున్నారని అన్నారు.  ఒక రోజు హరీష్ రావు, మరో రోజు కేటీఆర్, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత మాట్లాడతారని విమర్శించారు. గాంధీభవన్ లో బండ్ల గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు ప్రగతిపథంలో దూసుకుపోతున్నారని అన్నారు.

 వంద రోజుల తర్వాత కాంగ్రెస్‌ను హరీష్ రావు ఏమీ చేయలేరని బండ్ల గణేష్ అన్నారు. నియంతృత్వ పాలనకు పాతరేసి, ప్రజాపాలన తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, ఆరోగ్య భీమా రూ. 10 లక్షలు చేశామని చెప్పారు. 

గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పాలని బండ్ల గణేష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులే అయిందని అర్ధం చేసుకోకుండా హరీ్ష్ రావు, కేటీఆర్ ప్రతి రోజు ప్రెస్ మీట్‌లు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. నెల రోజుల్లో ఇంత గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తుంటే.. హరీష్ రావు ఎందుకింత ఈర్ష్య పడుతున్నారని బండ్ల గణేష్ ప్రశ్నించారు. కేంద్రం నుంచి  తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారని బండ్ల గణేష్ చెప్పారు.