‘కొడంగల్’ పనులు షురూ..మొదటి విడత కింద స్టేజ్-1 పనులు ప్రారంభం

‘కొడంగల్’ పనులు షురూ..మొదటి విడత కింద స్టేజ్-1 పనులు ప్రారంభం
  •      స్పీడందుకున్న అప్రోచ్​చానల్, పంప్​ హౌస్​ వర్క్స్​
  •      సిద్ధంగా ప్రెషర్​మెయిన్​పైపులు
  •      మొదటి విడతలో రూ.1,400 కోట్ల నిధులు

మహబూబ్​నగర్, వెలుగు : గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ‘కొడంగల్’ లిఫ్ట్​ ఇరిగేషన్​ పనులు ముందుకు పడ్డాయి. జీవో 69 ద్వారా 2014లోనే ఈ లిఫ్ట్​ను నిర్మించాలని అనుమతులు వచ్చినా, పనులు ప్రారంభించకుండా అప్పటి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. పదేండ్ల తర్వాత 2023లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్​ రెడ్డి ఈ స్కీమ్​పై స్పెషల్​ ఫోకస్ పెట్టారు. 

ఇరిగేషన్, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చారు. స్కీమ్​కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ గతేడాది పూర్తి కాగా, ఇటీవల దామరగిద్ద, కొడంగల్​ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి.

​మూడు విడతల్లో పనులు..  

కొడంగల్​లిఫ్ట్​స్కీమ్​ పనులను మూడు విడతలుగా చేపట్టనున్నారు. ప్రాజెక్టు కాస్ట్​ రూ.4,885 కోట్లు కాగా, మొదటి విడత కింద రూ.2,945 కోట్ల పనులు చేయాల్సి ఉంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఈ రెండు ప్యాకేజీల్లో స్టేజ్​-1 (కాట్రేవుపల్లి), స్టేజ్​-2 (ఊట్కూరు/బాపూర్​ ), స్టేజ్​-3 (పేపరళ్ల జయమ్మ చెరువు) పంప్​ హౌస్​లు,  పైపులైన్​ పనులు చేపట్టనున్నారు. 

ప్రస్తుతం రూ.1,400 కోట్లు మంజూరు కావడంతో పది రోజుల కింద స్టేజ్​-1 పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మక్తల్​ మండలం కాంట్రేవుపల్లి వద్ద అప్రోచ్​చానల్, పంప్​ హౌస్​పనులకు శ్రీకారం చుట్టారు. ఈ స్టేజ్​లో కాట్రేవుపల్లి పంప్​ హౌస్​ నుంచి మంథన్​ గోడ్, కాచ్వార్​ మీదుగా ఊట్కూరు పెద్ద చెరువు వరకు ప్రెషన్​ మెయిన్​ పైపుల ఏర్పాటు, ఇతర పనులు చేయనున్నారు. కాచ్వార్​ వద్ద ప్రెషర్​ మెయిన్​ పైపులను సిద్ధంగా ఉంచారు. రెండో విడతలో కెనాల్స్​, డిస్ట్రిబ్యూటరీ సిస్టం డెవలప్​మెంట్, చెరువుల కెపాసిటీని పెంచనున్నారు. మూడో విడతలో విద్యుత్​ సబ్​ స్టేషన్​ల నిర్మాణం, ఇతర పనులు చేపట్టనున్నారు.

చెరువులుగా రిజర్వాయర్లు..

నారాయణపేట, -కొడంగల్, ​-మక్తల్​ లిఫ్ట్​ కింద మొత్తం పది రిజర్వాయర్లను నిర్మించనున్నారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉండడంతో, ఈ మూడు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న చెరువులనే రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం వాటికున్న నీటి నిల్వ కెపాసిటీని పెంచనున్నారు. 

రిజర్వాయర్లుగా మక్తల్​ నియోజకవర్గంలోని ఊట్కూర్ చెరువు, నారాయణపేట నియోజకవర్గం నారాయణపేట మండలంలోని జాజాపూర్ చెరువు, పేరపళ్ల గ్రామంలోని జాయమ్మ చెరువు, దామరగిద్ద మండలంలోని కాన్​కుర్తి చెరువు, కొడంగల్​ నియోజకవర్గంలోని దౌల్తాబాద్​ చెరువు, కొడంగల్​చెరువు, హస్నాబాద్​చెరువు, బొంరాస్​​పేట చెరువు, లక్ష్మీపూర్​చెరువు, ఈర్లపల్లి చెరువులు అభివృద్ధి చెందనున్నాయి. 

లక్ష ఎకరాలకు సాగునీరు.. 

ప్రాజెక్టు కింద నారాయణపేట, మక్తల్, కొడంగల్​ నియోజకవర్గాల్లోని పది మండలాల పరిధిలో ఉన్న లక్ష ఎకరాలకు సాగునీరు, 123 గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. ఈ మేరకు పది రిజర్వాయర్ల పరిధిలో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. ప్రాజెక్టు వెంట గ్రీన్​ బెల్ట్​ను ఏర్పాటు చేయడంతో పాటు 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు.