ఏపీకి వత్తాసు పలుకుతరా!.. కృష్ణా బోర్డుకు తెలంగాణ ఘాటు లేఖ

ఏపీకి వత్తాసు  పలుకుతరా!.. కృష్ణా బోర్డుకు  తెలంగాణ ఘాటు లేఖ
  • ఆ రాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా మా ప్రాజెక్టులపై అక్కసు చూపుతరా?
  • పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్, హంద్రీనీవా, 
  • తెలుగుగంగ లాంటి ప్రాజెక్టులపై ఎన్నో లేఖలు రాసినం
  • మా లేఖలను ఏనాడూ పట్టించుకోలేదు
  • మా ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్పగానే కేంద్రానికి లేఖ రాస్తరా?
  • ఏపీ అక్రమంగా 290 టీఎంసీలు తరలించుకునే ప్లాన్​ చేస్తున్నది
  • ముందు వాటికి అడ్డుకట్ట వేయండి.. ఏపీని నిలువరించండి
  • వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ రూ.47,776.50 కోట్ల ప్రాజెక్టులను చేపట్టినా పట్టించుకోని కృష్ణా బోర్డు.. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నదని ప్రభుత్వం మండిపడింది. శ్రీశైలం ఆధారంగా పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ ద్వారా కోటాకు మించి నీటి మళ్లింపులకు చేపడుతున్న ఎస్​ఆర్​బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, విభజన చట్టంలోని 84(3)(II), 85(8)(d) సెక్షన్లను ఉల్లంఘించి నిర్మిస్తున్నదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి కడుతున్న ఆ ప్రాజెక్టులను ఆపాలంటూ బోర్డుకు పలుమార్లు తాము లేఖలు రాసినా బుట్టదాఖలు చేశారని ఆక్షేపించింది. దానివల్ల తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంది. తెలంగాణ ఎన్నిసార్లు లేఖలు రాసినా.. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఎలాంటి చర్యలూ తీసుకోని బోర్డు.. ఆ రాష్ట్రానికే వత్తాసు పలుకుతూ తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయడం దారుణమని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఈఎన్​సీ జనరల్​ రమేశ్​ బాబు ఇటీవల ఘాటు లేఖ రాశారు. 


 ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్​లో నీటి కేటాయింపులపై వాదనలు జరుగుతున్నాయని, తెలంగాణకు రావాల్సిన నీటి హక్కుల డిమాండ్లను ట్రిబ్యునల్​ ముందు పెట్టామని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే నిరుడు సెప్టెంబర్​లో 16 ప్రాజెక్టుల డీపీఆర్​ తయారీకి జీవో జారీ చేశామని, ఆ విషయాన్నీ ట్రిబ్యునల్​కు తెలియజేశామని పేర్కొన్నారు. ఆ జీవోనూ ట్రిబ్యునల్​కు సమర్పించామన్నారు. కృష్ణా జలాలను వినియోగించుకునేలా కృష్ణా పరీవాహకంలోనే ఆ ప్రాజెక్టులపై ముందుకు వెళ్తున్నామన్నారు.

కృష్ణా నీళ్లు పెన్నా బేసిన్​కు తీసుకెళ్తున్నరు

తెలంగాణ చేపట్టదలుచుకున్న ప్రాజెక్టులన్నీ 2014 కన్నా ముందే ఉన్నవని, బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డు మేరకే వాటిని తాము చేపట్టామని లేఖలో ఈఎన్​సీ రమేశ్​ బాబు స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టులేవీ కొత్తవి కాదన్నారు. న్యాయంగా తమకు రావాల్సిన జలాల్లో ప్రాజెక్టులవారీగా కేటాయింపులు కోరుతున్నామన్నారు. కానీ, అందుకు విరుద్ధంగా ఏపీ మాత్రం కృష్ణా నీళ్లను పెన్నా బేసిన్​కు ఏపీ తరలించుకుపోతున్నదని లేఖలో ఈఎన్​సీ పేర్కొన్నారు. ఇప్పటికే 360 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్లను నిర్మించుకున్నదని చెప్పారు. అదనంగా ఇప్పుడు మరో 290 టీఎంసీలు తరలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​లో అదనంగా 10 గేట్లను పెట్టారని, కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 1,56,100 క్యూసెక్కులకు పెంచుకున్నారని ఆరోపించారు. దానికి సంబంధించి 2005లో ఇచ్చిన జీవో 170, 2006లో ఇచ్చిన జీవోలు 3, 206లను ట్రిబ్యునల్​కు ఏపీ సమర్పించలేదని విమర్శించారు. దాంతో పాటు 2020లో రాయలసీమ లిఫ్ట్​ స్కీమ్​తో పాటు పలు ప్రాజెక్టులకు రూ.6,829.15 కోట్లకు పరిపాలన అనుమతులిస్తూ ఏపీ జీవో 203 జారీ చేసిందన్నారు. శ్రీశైలం నుంచి రోజుకు 11 టీఎంసీలు తరలించేలా కెపాసిటీని పెంచుకునే ప్రయత్నాలు చేసిందన్నారు. దీనిపై 2020 మే 12న కృష్ణా బోర్డుకు లేఖ రాశామని, ఏపీ అనధికార ప్రాజెక్టులను ఆపాలని కోరామని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్​ను వ్యతిరేకిస్తూ పలుమార్లు కృష్ణా బోర్డు, కేంద్రానికి లేఖలు రాశామని.. అయినా బోర్డు నుంచి గానీ.. కేంద్రం నుంచి గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణకు సంబంధించి ఏపీ చేసిన ఆరోపణలకు వెనువెంటనే స్పందించి అక్కసు వెళ్లగక్కిందని పేర్కొన్నారు.  

ఆ ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలి..

ఏపీ 290 టీఎంసీల కృష్ణా జలాలను అవుట్​ సైడ్​ బేసిన్​కు తరలించేలా కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని లేఖలో ఈఎన్​సీ ఆరోపించారు. కర్నూలు, కడప జిల్లాల్లో తెలుగుగంగ కింద రెండో పంట కోసం 15 టీఎంసీలు, హంద్రీనీవా ఎక్స్​టెన్షన్​కు 6 టీఎంసీలు, హంద్రీనీవా కింద రెండో పంట కోసం 28 టీఎంసీలు, పరిశ్రమల అవసరాలు, చెరువులను నింపేందుకు, తాగునీటి కోసం 20.69 టీఎంసీలు, వెలిగొండ ప్రాజెక్టుకు 2.66 టీఎంసీలు, గాలేరు నగరి కింద రెండో పంట కోసం 26.6 టీఎంసీలు, గాలేరు నగరి లిఫ్ట్​కు 15.8 టీఎంసీల చొప్పున 114.75 టీఎంసీల తరలింపునకు ఏపీ ప్రాజెక్టులు చేపడుతున్నదని పేర్కొన్నారు. వాటితో పాటు వరికపుడిశల స్కీమ్​ (ఫేజ్​ 1, 2) కింద 7.867 టీఎంసీలు, సాగర్​ కుడి కాల్వ ఎక్స్​టెన్షన్​కు 78 టీఎంసీలు, గుంటూరు చానెల్​ అదనపు ఆయకట్టుకు 1.3 టీఎంసీలు, శ్రీశైలం రైట్​ బ్రాంచ్​ కెనాల్​ ఎక్స్​టెన్షన్​ కోసం 15 టీఎంసీలు, తుంగభద్ర హైలెవెల్​ కెనాల్​తో 25 టీఎంసీలు, సాగర్​ కుడి కాల్వ ద్వారా గుండ్లకమ్మ, మూసీ, పాలేరులకు 20 టీఎంసీలు, శ్రీశైలం రైట్​ బ్రాంచ్​ కెనాల్​ కింద రెండో పంట కోసం 19 టీఎంసీలు, సిద్ధాపురం లిఫ్ట్​ కింద 2 టీఎంసీలు, వేదవతి లిఫ్ట్​కు 8.29 టీఎంసీల చొప్పున నీళ్లను తీసుకుపోయే ప్రాజెక్టులకు ఏపీ ప్లాన్​ చేస్తున్నదని పేర్కొన్నారు. అవన్నీ బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధంగా చేపడుతున్నవేనని తేల్చి చెప్పారు. బేసిన్​లో ఉన్న రాష్ట్రాల అవసరాలు తీరకుండా.. ఔట్​సైడ్​ బేసిన్​కు తరలిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 43 శాతం వరకు ఔట్​సైడ్​ బేసిన్​కు తరలిస్తున్నదని కృష్ణా ట్రిబ్యునల్​ కూడా గుర్తించిందన్నారు. కాబట్టి, ఏపీ చేపడుతున్న ఆ అక్రమ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు దృష్టి సారించాలని, వాటిని చేపట్టకుండా ఏపీని నిలువరించాలని ఆయన డిమాండ్​ చేశారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా, విస్తరణలు చేయకుండా ఏపీని అడ్డుకోవాలన్నారు. ఏపీ ప్రాజెక్టుల విషయంపై కేంద్రానికి బోర్డు లేఖ రాయాలని ఆయన తేల్చి చెప్పారు.