- తాజాగా చికెన్ విషయంలో రెండు వర్గాల కొట్లాట
- గతంలోనూ విద్యార్థుల మధ్య పలుమార్లు పరస్పర దాడులు
- ఉన్నతాధికారులు దృష్టి పెడితేనే మేలు
హనుమకొండ, వెలుగు: విద్యార్థి ఉద్యమాలు, ఉన్నత చదువులకు కేంద్రమైన కాకతీయ యూనివర్సిటీ గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం ఇక్కడకు వస్తున్న కొందరు విద్యార్థులు స్టడీస్ పక్కన పెట్టి ఫైటింగులకు దిగుతున్నారు. తాజాగా చికెన్ పంపకాల విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకునే దాకా వెళ్లడం చర్చనీయాంశమైంది. క్యాంపస్ లో కొంతమంది విద్యార్థులు తరచూ ఇలాగే కొట్లాటలకు దిగుతుండగా, వర్సిటీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే విద్యార్థులు గొడవల దాకా వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉద్యమాలకు కేంద్రం కేయూ..
రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత కాకతీయ యూనివర్సిటీకి అంతటి ప్రాధాన్యం ఉన్నది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లోనూ కేయూ కీలకంగా నిలిచింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ తో పాటు ఎంతోమంది ఇక్కడి నుంచి ఉద్యమాలు కొనసాగించారు. అంతటి ప్రతిష్ట కలిగిన కేయూ ఇటీవల విద్యార్థుల గొడవలతో తరచూ చర్చల్లో నిలవడం విమర్శలకు తావిస్తోంది.
క్యాంపస్ రోడ్లపై స్టూడెంట్ల ఫైటింగ్స్..
ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కేయూలో అడ్మిషన్ కోసం వేలాది మంది క్యూ కడుతుంటారు. అనుకున్న కోర్సుల్లో సీట్లు సాధించేందుకు పోటీ పడుతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్యాంపస్ లో కొంతమంది విద్యార్థులు తరచూ గొడవలకు పాల్పడుతున్నారు. వివిధ కారణాలను సాకుగా చూపి క్యాంపస్ రోడ్లపై ఫైటింగ్ కు దిగుతున్నారు. గత ఆదివారం చికెన్ విషయంలో ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్ స్టూడెంట్స్ మధ్య తలెత్తిన వివాదం కాస్త గొడవకు దారి తీయగా, ఇరువర్గాల విద్యార్థులు ఒకేరోజు మూడు దఫాలుగా కొట్లాటకు దిగారు.
ఇందులో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, ఓ స్టూడెంట్ కు తల పగిలి ఐదు కుట్లు పడ్డాయి. చికెన్ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పది మందిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంతకుముందు కూడా విద్యార్థులు క్యాంపస్ రోడ్లపై గొడవలకు దిగిన ఘటనలున్నాయి. గత సెప్టెంబర్ లో ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పై కొందరు నాన్ బోర్డర్స్ దాడికి దిగారు.
దీంతో వర్సిటీ క్యాంపస్ లో ఉద్రిక్తత చోటుచేసుకోగా, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, కేయూ పోలీసులు వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గత ఫిబ్రవరిలో కూడా కేయూ కామన్ మెస్ వద్ద ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీకి చెందిన సీనియర్స్, జూనియర్స్ మధ్య రెస్పెక్ట్ విషయంలో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు ప్లేట్లు, చేతికందిన వస్తువులతో దాడి చేసుకోగా, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ జూనియర్స్ 11 మంది, సీనియర్స్ 8 మంది, ఓ విద్యార్థి సంఘానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
ఆఫీసర్ల పర్యవేక్షణ లేకనే..!
వర్సిటీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల చికెన్ విషయంలో గొడవ జరగగా, విద్యార్థులు మూడు దఫాలుగా ఫైటింగ్ కు దిగినా ఆఫీసర్లు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. సాధారణంగా మెస్ లో వండిన వాటిని బయటకు గానీ, హాస్టల్ లోకి గానీ తీసుకెళ్లడం హాస్టల్ రూల్స్ కు విరుద్ధం. అలా తీసుకెళ్లకుండా చూడాల్సిన సూపర్ వైజర్లు, మెస్ కేర్ టేకర్లు, జాయింట్ డైరెక్టర్ల నిర్లక్ష్యమే గత ఆదివారం విద్యార్థుల కొట్లాటకు కారణమైందనే వాదనలున్నాయి.
కొంతమంది మెస్ కేర్ టేకర్లు, జాయింట్ డైరెక్టర్లు నాన్ బోర్డర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండటం, వర్సిటీ అంశాలపై పెద్దాఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థుల మధ్య గొడవలకు దారి తీస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా యూనివర్సిటీ ఆఫీసర్లు తగిన చర్యలు చేపట్టి, స్టూడెంట్ల కొట్లాటలకు ఆస్కారం లేకుండా వర్సిటీ పాలనను గాడిన పెట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

