మెదక్ జిల్లాలో కో ఆప్షన్ పదవు లపై కన్ను

మెదక్ జిల్లాలో  కో ఆప్షన్ పదవు లపై కన్ను
  •     కౌన్సిలర్లతో సమాన హోదా
  •     నాయకుల మద్ధతుకు ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కొత్త పాలక వర్గాలు కొలువు దీరాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి కో ఆప్షన్ పదవులపై పడింది. రిజర్వేషన్ అనుకూలించక కౌన్సిలర్ పదవికి పోటీ చేసేందుకు అవకాశం కోల్పోయిన నాయకులు కో ఆప్షన్ పదవులపై కన్నేశారు.2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం ఆయా మున్సిపాలిటీల్లో గ్రేడ్ లను బట్టి ఇద్దరి నుంచి నలుగురు కో ఆప్షన్ సభ్యులను నియమిస్తారు. 

కో ఆప్షన్ సభ్యత్వం కోసం అందిన దరఖాస్తులను బట్టి వారి అర్హత, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని  కౌన్సిల్ ఆమోదంతో నియామకపు ప్రక్రియను పూర్తి చేస్తారు. వాస్తవానికి ఒక్కో మున్సిపాలిటీకి  ఇద్దరు మాత్రమే కో ఆప్షన్ సభ్యులు ఉండాల్సి ఉన్నా  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే  ఇద్దరి కంటే ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తారు. కౌన్సిలర్ హోదాతో సమానమైన కో ఆప్షన్ కోసం మైనార్టీలు, మహిళా నేతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీల ఎన్నికలు జరిగాయి. 

ఈ లెక్కన 40కి పైగా కో ఆప్షన్ పదవులు లభిస్తాయి. మైనార్టీ జనరల్ కు ఒకటి, మైనార్టీ మహిళకు ఒకటి, జనరల్ కు  ఒకటి కేటాయిస్తారు. మున్సిపల్ కమిషనర్లు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి నిబంధనల ప్రకారం కో ఆప్షన్ పదవులు భర్తీ చేస్తారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్​చార్జిలు అనుకున్న వారికే కో ఆప్షన్ పదవులు లభిస్తాయి. ఈ మేరకు ఆ పదవులు ఆశిస్తున్న వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మెదక్ జిల్లాలో..

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా మూడు, తూప్రాన్ లో 16, నర్సాపూర్ లో 15, రామాయంపేటలో 12 వార్డులు ఉండగా రెండు చొప్పున కో ఆప్షన్ పదవులు లభించే అవకాశం ఉంది. మెదక్, రామాయంపేట, నర్సాపూర్ లో కాంగ్రెస్ పాలక వర్గాలు కొలువు దీరాయి. ఈ మేరకు ఆయా చోట్ల కో ఆప్షన్ పదవుల కోసం ఆశావహులు ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్  సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జి రాజిరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తూప్రాన్ లో బీఆర్ఎస్ పాలక వర్గం కొలువు దీరగా గజ్వేల్ నియోజకవర్గ పార్టీ ఇన్​చార్జి ప్రతాప్ రెడ్డి ద్వారా ఆ పార్టీ నాయకులు కో ఆప్షన్ పదవుల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో ఎనిమిది మంది కో ఆప్షన్లకు అవకాశం ఉంది. జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల మున్సిపాలిటీల్లో ఇద్దరేసి కో ఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంది. వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి సిద్ధమైన సమయంలో పలువురికి కో ఆప్షన్ పదవిని ఆశగా చూపి బరిలో లేకుండా చేశారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తవడంతో గతంలో పోటీ నుంచి వెనుదిరిగిన వారు ప్రస్తుతం తమకు అవకాశం కల్పించాలని మున్సిపాలిటీల్లోని ముఖ్య నేతలను కోరుతున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉండగా 40 మంది  కో- ఆప్షన్ సభ్యులు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో నలుగురు కో- ఆప్షన్ మెంబర్లను ఎన్నుకునే ఛాన్స్ ఉంది.  జహీరాబాద్, కోహిర్ బల్దియాల్లో నలుగురు చొప్పున కో -ఆప్షన్ సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో ఇద్దరు మైనారిటీలు, మరో ఇద్దరు ఇతరులను ఎంపిక చేయనున్నారు. 

ఇక్కడ కాంగ్రెస్ కు చైర్మన్ పదవి దక్కేందుకు సపోర్ట్ చేసిన ఎంఐఎం, ఇండిపెండెంట్ సభ్యుల సూచనల మేరకు కో-ఆప్షన్ పదవులు దక్కనున్నాయి. కోహిర్, అందోల్ -జోగిపేట, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు పోటీ తీవ్రంగా ఉంది. రిజర్వేషన్లకు అనుగుణంగా కో-ఆప్షన్ల ఎంపిక జరగనుంది.