ఆదిలాబాద్ జిల్లాలో పాత ఫోన్లతో సైబర్ నేరాలు

ఆదిలాబాద్ జిల్లాలో పాత ఫోన్లతో సైబర్ నేరాలు
  •     గిఫ్ట్​ల ఆశచూపి కొనుగోలు చేస్తున్న యూపీ, ఢిల్లీ, బిహార్ గ్యాంగ్​లు
  •     కస్టమర్ల డాటా, ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా మోసాలు
  •     ఆదిలాబాద్​ జిల్లాలో ఈ నెల 21న పట్టుబడ్డ  అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు

ఆదిలాబాద్, వెలుగు: చిన్న ఫోన్ కు చిన్న టిఫిన్ బాక్స్.. పెద్ద ఫోన్ కు పెద్ద టిఫిన్ బాక్స్​ఇస్తాం.. రండి త్వరపడండి.. బ్యాటరీలు లేనివి, స్క్రీన్ పగిలిపోయినా.. పని చేయకుండా ఉన్నా సరే.. పాత మొబైల్స్ తీసుకుంటాం.. అంటూ ఆదిలాబాద్ జిల్లాలో రెండేండ్లుగా బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ గ్యాంగ్​లు హల్​చల్ చేస్తున్నాయి. పాత ఫోన్లు కొనుగోలు చేసి, వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. వారం రోజుల వ్యవధిలోనే పాత మొబైల్స్​ కొనుగోలు చేస్తున్న 2 అంతరాష్ట్ర ముఠా సభ్యులు అరెస్టయ్యారు. 

ఓ వైపు సైబర్ నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు అంతరాష్ట్ర ముఠాలు అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పటివరకు ఫోన్లకు వచ్చే కాల్స్ ఓటీపీలు, మెస్సేజ్​లు, లింక్​ల ఆధారంగా డబ్బులు పోగుట్టుకుంటున్న సందర్భాలే ఉన్నాయి. తాజాగా పాత ఫోన్లు కొనుగోలు చేసి అందులోని డాటా, ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా అమాయకులు ఫోన్లు చేస్తూ ఓటీపీలు అడుగుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లా పోలీసులు ఇటీవల రహదారులపై విస్తృతంగా తనిఖీలు చేస్తుండటంతో ఇలాంటి గ్యాంగ్ ల మోసాలు బయటపడుతున్నాయి. 

విడి భాగాలు ఢిల్లీ, హైదరాబాద్​లో విక్రయం

జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంతరాష్ట్ర ముఠాలు కొంతకాలంగా తిరుగుతూ ప్రజల వద్ద నుంచి పాత ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. వాటి నుంచి మదర్‌బోర్డులు, బ్యాటరీలు, సాకెట్లు వేరుచేసి ఇతర రిపేర్ చేసిన ఫోన్లలో అమర్చుతారు. పాత ఫోన్ల ద్వారా కస్టమర్ల డేటా, ఐఎంఈఐ నంబర్లు సేకరించి బ్యాంక్​ ఆఫీసర్లమని, కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెబుతూ అమాయక ప్రజలను ఓటీపీ అడిగి, వారి బ్యాంక్​అకౌంట్ల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. 

మిగతా విడి భాగాలను ఢిల్లీ, హైదరాబాద్‌లో విక్రయిస్తూ లబ్ధి పొందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై వెంటనే 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. 

ఈ నెల 21న ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషీని పోలీసులు అరెస్ట్​చేశారు. వారి వద్ద నుంచి పాత ఫోన్లు, బ్యాటరీలు, కీప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో పాత ఫోన్లు కొనుగోలు చేసి, వాటిలోని డాటాను సేకరించి, బ్యాంక్​ఆఫీసర్లమంటూ ఫోన్లు చేస్తూ నేరాలు పాల్పడుతున్నట్లు తేలింది.

 ఈ నెల 23న ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్, సాహిల్, అనాస్, ఒక బాల నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో వీరి నుంచి 1,500 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గ్రామీణ ప్రాంతాల నుంచి పాత సెల్​ఫోన్లు కొనుగోలు చేసి, వాటిలోని డాటా, ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

తెలియని వ్యక్తులకు అమ్మొద్దు

పాత ఫోన్లను అమ్మే ముందు యజమానులు జాగ్రత్తలు పాటించాలి. గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకోవద్దు. మొబైల్ షాపుల యజమానులు పాత మొబైల్స్​ను కొనుగోలు చేసే ముందు విక్రయించేవారి ధ్రువపత్రాలను, బిల్లులను సరిచూసుకొని కొనుగోలు చేయాలి. సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
- ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ