- పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గృహజ్యోతి లబ్ధిదారుల ఇండ్లకు
- రూప్ టాప్ సోలార్ ఏర్పాటు
- నల్గొండ జిల్లాలో మూడు గ్రామాలు ఎంపిక
- తొలి విడతలో వెయ్యి ఇండ్లకు ఏర్పాటు
నల్గొండ, వెలుగు: సౌర విద్యుత్‌ను పల్లెల్లోనూ అందరికీ అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో జిల్లాలో తొలి విడతలో పైలెట్ ప్రాజెక్ట్ గా మూడు గ్రామాలను ఎంపిక చేసి సుమారు వెయ్యి ఇళ్లకు సౌర విద్యుత్‌యూనిట్లు సప్లయ్ చేయనుంది. ఆ దిశగాఅధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మార్కింగ్ పనులు పూర్తి చేసి ఇన్స్టాలేషన్ పనులు కొనసాగుతుండగా వచ్చే మార్చి నాటికి అన్నీ పనులు పూర్తి చేస్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సౌర విద్యుత్‌ను గ్రామాలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ స్కీమ్ కింద నల్గొండ జిల్లాలో తొలిదశలో కనగల్, అనుముల, ముదిగొండ విలేజ్ లను పైలెట్ గ్రామలుగా అధికారులు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఒక్కో ఇంటిలో రెండు కిలో వాట్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కిలో వాట్ కు రూ. 68 వేలు ఖర్చు అవుతుంది.
రెండు కిలో వాట్ సోలార్ యూనిట్ కు రూ.1.36 లక్షలు ఖర్చు కాగా.. కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు ఇస్తుంది. మిగిలిన రూ.76 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఇప్పటికే గ్రామంలోని గృహజ్యోతి లబ్దిదారుల లిస్ట్ సేకరించిన అధికారులు ఆయా గ్రామాల్లో గృహాలు ఎన్ని? సోలార్‌విద్యుత్‌పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూఫ్‌టాప్‌లు అనుకూలంగా ఉన్నాయా? తదితర వివరాలను సేకరించి గ్రామాల్లో సోలార్‌యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
జిల్లాలో ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో గృహ జ్యోతి కింద ఉన్న వెయ్యి ఇండ్లకు ముందుగా రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో కనగల్ గ్రామంలో 292 మంది, అనుముల గ్రామంలో 605 మంది, ముదిగొండ (దేవరకొండ) గ్రామంలో 354 మంది గృహ జ్యోతి లబ్దిదారులను ఎంపిక చేశారు. ఇప్పటికే మార్కింగ్ ప్రక్రియ పూర్తి అవ్వగా 77మందికి ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
విద్యుత్ ఆదా
రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి స్కీమ్ కింద అర్హులైన లబ్దిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఈ క్రమంలో ప్రతి ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసి ఆర్దిక భారాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టింది. ఒక్కో ఇంటిపైన 2 కిలో వాట్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తే 240యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
జనరేట్ అయిన విద్యుత్ ను ప్రజల అవసరాలకు పొగ మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ యూనిట్లను ఏర్పాటు చేసి మూడు, ఆరు నెలలకు ఒకసారి ఆదా అయిన విద్యుత్ ను డిస్కం లకు అమ్ముకునేలాప్లాన్ చేస్తున్నారు. ఒక్కో యూనిట్ కు రూ.2.40 కు డిస్కం నుంచి చెల్లించేలా ప్రతిపాదనలు పెట్టగా త్వరలో ప్రభుత్వం నుండి ధర నిర్ణయించే అవకాశం ఉంది.
మార్చి నాటికి అన్నీ ఇండ్లకు పూర్తి
100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం గృహ జ్యోతి లబ్దిదారుల ఇంటి పై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేస్తుంది. నల్గొండ జిల్లాలో మూడు గ్రామాలను ఎంపిక చేసి ఇంస్టాలేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగినది. మార్చి నాటికి అన్ని ఇన్స్టాలేషన్ పూర్తి చేస్తాం.
- సంతోష్, రెడ్ కో మేనేజర్, ఉమ్మడి నల్గొండ జిల్లా
