లోన్ తీసుకోకున్నా చెల్లించాలంటూ బ్యాంకు నోటీసులు

లోన్ తీసుకోకున్నా చెల్లించాలంటూ బ్యాంకు నోటీసులు
  • నాలుగేండ్ల తర్వాత బ్యాంకు నోటీసులు
  • నమ్మించి మోసం చేశారంటూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు

సిద్దిపేట రూరల్, వెలుగు: తాము లోన్​తీసుకోకపోయినా.. చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయని, న్యాయం చేయాలంటూ పలువురు రైతులు పోలీసులను ఆశ్రయించారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రైతుల దగ్గరకు 2017వ సంవత్సరంలో అప్పటి బ్యాంక్ మేనేజర్, మాజీ సర్పంచ్ కొడుకులు వెళ్లి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. వారి నుంచి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోటో, పేపర్ మీద సంతకం తీసుకున్నారు. ఎన్ని రోజులైనా లోన్ రాకపోవడంతో రైతులు వారిని ప్రశ్నించారు. పూర్తి సబ్సిడీతో వేరే లోను ఇప్పిస్తామని, ఒక్క రూపాయి కట్టనవసరం లేదని చెప్పి ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున 80 మంది రైతులకు ఇంటికి వెళ్లి మరీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కొందరు నిరుద్యోగులకు సైతం రూ. 50 వేల చొప్పున ఇచ్చారు. అప్పట్లో డబ్బులు తీసుకున్నవారందరికీ ప్రస్తుతం యూనియన్​బ్యాంక్​నుంచి నోటీసులు అందాయి. ఒక్కొక్కరు లోన్​డబ్బులు రూ. 1.5 లక్షలు, మిత్తి రూ. లక్ష వరకు కట్టాలంటూ అందులో పేర్కొన్నారు. దాంతో రైతులంతా పోలీసులను ఆశ్రయించారు. లోన్​కట్టలేదంటూ తమ అకౌంట్లను బ్యాంకు అధికారులు బ్లాక్ చేస్తున్నారని, పెన్షన్, రైతుబంధు, వడ్ల డబ్బులు పట్టుకుంటున్నారని వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ చెప్పారు.