అబిడ్స్ SBI బ్యాంకులో కాల్పులు

అబిడ్స్ SBI బ్యాంకులో కాల్పులు
  • ఆవేశంతో తోటి ఉద్యోగిపై కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు
  • హైదర్ గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేందర్

హైదరాబాద్ : అబిడ్స్ ఎస్బీఐ బ్యాంక్ లో కాల్పులు జరిగాయి. సెక్యూరిటీ గార్డు ఖాన్ తన గన్ తీసుకుని ఆవేశంతో తోటి ఉద్యోగి సురేందర్ పై కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు సురేందర్ చేతిలో నుంచి దూసుకెళ్లాయి. బుధవారం మధ్యాహ్నం బ్యాంకు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలోనే కాల్పులు జరగడం కలకలం రేపింది. సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఖాన్ కు , బ్యాంక్ ఉద్యోగి సురేందర్ కు మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కాల్పులకు దారితీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఆవేశంలో గార్డ్ సర్దార్ ఖాన్ తన వద్ద ఉన్న గన్ తో సురేందర్ పై కాల్పులు జరుపగా.. సురేందర్ చెయ్యి  అడ్డు పెట్టుకుని కాల్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఛాతి భాగంలో బుల్లెట్లు దిగడంతో హుటాహుటిన హైదర్ గూడలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు తోటి ఉద్యోగులు. సర్దార్ ఖాన్ 20 ఏళ్లుగా బ్యాంకులో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. సురేందర్ తో స్నేహంగా ఉండేవాడని.. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కాని వాగ్వాదం చేసుకోవడం మామూలేనని సరిపెట్టుకున్న ఉద్యోగులు ఊహించని రీతిలో కాల్పులు జరగడంతో షాక్ కు గురయ్యారు. గాయపడిన సురేందర్ ను హుటాహుటిన హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు ను అబిడ్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.