ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్ కుటుంబ సభ్యులకు.. బారామతి కంచుకోట

ఎన్సీపీ చీఫ్​ శరద్  పవార్  కుటుంబ సభ్యులకు.. బారామతి కంచుకోట

బారామతిలో పవార్ 
సుప్రియా సూలె వర్సెస్ సునేత్రా పవార్

పుణె: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రముఖ సీట్లలో బారామతి సీటు కూడా ఒకటి. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ లోక్ సభ స్థానం ఉంది. ఎన్సీపీ చీఫ్​ శరద్  పవార్  కుటుంబ సభ్యులకు ఇది కంచుకోట. ఈ ఎన్నికల్లో పవార్  కుటుంబం నుంచి ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేస్తుండడంతో దేశవ్యాప్తంగా ఈ స్థానంపై ఆసక్తి నెలకొంది. శరద్  పవార్  కూతురు సుప్రియా సూలె, అజిత్  పవార్  (శరద్  పవార్  అన్న కొడుకు) భార్య సునేత్రా పవార్.. బారామతి లోక్ సభ బరిలో నిలిచారు.

ఎన్సీపీ వర్గం నుంచి సుప్రియ పోటీ చేస్తుండగా..అజిత్  పవార్  వర్గం నుంచి సునేత్ర బరిలో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సునేత్ర మొదటిసారిగా పోటీచేస్తున్నారు. నిరుడు జులైలో ఎన్సీపీ చీలి పోయిన తర్వాత రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఎన్నిక కావడంతో బారామతి సీటు ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. ఈ స్థానంలో గెలుపు.. తమ వంశ గౌరవానికి కీలకం కావడంతో అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.

అభివృద్ధిపై సూలె, సేవపై సునేత్ర ఆశలు

సుప్రియా సూలె ఇప్పటికే బారామతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మూడుసార్లు గెలిచారు. నాలుగోసారి కూడా విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో ఓటర్లను కలిసి గత 15 ఏండ్లలో తాను చేసిన అభివృద్ధి పనులపై ఆమె ప్రచారం చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఆమె ఉన్నారు. అలాగే ఆమె తండ్రి శరద్  పవార్  కూడా మీటింగులు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

‘బారామతిలో మార్పు తేవడమే లక్ష్యం’ నినాదంతో శరద్  ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, లోక్ సభ బరిలో తొలిసారి నిలిచిన సునేత్రా పవార్​ కూడా తన గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ఇప్పటికే వివిధ విద్యా సంస్థలు, పరిశ్రమల్లో ఆమె ఆఫీస్ బేరర్ గా పనిచేశారు. నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. తన భర్త అజిత్  చేసిన అభివృద్ధి పనులు, ప్రధాని మోదీ గ్యారంటీలపై ఆమె ఆశలు పెట్టుకున్నారు.