బస్తీ హమారా.. బల్దియా హమారా నినాదంతో ఎన్నికల్లో పోటీ

బస్తీ హమారా.. బల్దియా హమారా నినాదంతో ఎన్నికల్లో పోటీ

బస్తీ హమారా.. బల్దియా హమారా నినాదంతో GHMC ఎన్నికలలో పోరాడుతామన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్, బండి సంజయ్ కలిసి తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. BJP, TRS, MIM ఒకే ఎజెండా తో పనిచేస్తున్నాయని…కాంగ్రెస్ ను బలహీనం చేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడానికి MIM సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. దీనికి TRS సమన్వయం చేస్తోందన్న రేవంత్… బీహార్ లో అదే జరిగిందన్నారు.

అసద్ జైల్ కు వెళితే …బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావే బెయిల్ ఇప్పించారని గుర్తు చేశారు రేవంత్. బీజేపీ, ఎంఐఎం తెరముందు కుస్తీ, తెర వెనుక దోస్తీ చేస్తోందన్నారు. కేసీఆర్ ఆత్మ అయిన జూపల్లి రామేశ్వర్ రావ్ మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఎంపీ అరవింద్ ఫిర్యాదులు చేస్తే… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రామేశ్వర్ రావ్, ఆయన కొడుకు తో కలిసి పార్లమెంట్ లో కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి ని కలిసి రామేశ్వర్ రావుపైన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేపీకి నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్తున్న సిద్ధాంతాలు.. వాళ్ళు నమ్మితే రఘునందన్ రావ్, కిషన్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఫ్రెండ్లీగా ఉన్న వీడియోను మీడియాకు విడుదల చేసిన రేవంత్…కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు.

ప్రధాని మోడీ విధానాలను మేం తప్పని చెబితే సీఎం కేసీఆర్ వారికి మద్దతు ఇచ్చారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ నేతలు సచివాలయంలో వందేళ్ల చరిత్ర ఉన్న నల్లపోచమ్మ గుడిని కూల్చితే ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. ఈఎస్ఐ, సహారా కుంభకోణాల్లో సీబీఐ కేసుల్లో ఉన్న కేసీఆర్ ను బీజేపీనే కాపాడుతోందన్నారు.

బండి సంజయ్ సంతకాన్ని ఫోర్జరీ చేసారని బండి సంజయ్ అంటున్నారు… కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నేరుగా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. బండి సంజయ్ కి భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఉన్న నమ్మకం కిషన్ రెడ్డి పై లేదా అని అన్నారు. MIM కు TRS కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటున్న బీజేపీ… విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో చెప్పాలన్నారు. BJP,TRS,MIM మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ పై పోరాటం చేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి.