
లండన్: తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ పండుగ ఎల్లలు దాటింది. తెలంగాణలోనే కాకుండా పలు దేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగువారు. వివిధ పనిల నిమిత్తం విదేశాల్లో ఉంటున్నప్పటికీ మూలాలు మర్చిపోకుండా తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని చాటుతూ కెనడా, అమెరికా, ఖతర్, యూఏఈ, యూకే వంటి దేశాల్లోని తెలుగు ప్రజలు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈ ఏడాది లండన్లో కన్నుల పండుగగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. లూటన్ సిటీలో ఉంటున్న తెలుగు ప్రజలు లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆటపాటలతో మహిళలు సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ, పూలను పూజిస్తూ, గౌరమ్మను ఆరాధించారు ఆడబిడ్డలు. ఈ సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. బతుకమ్మలను పేర్చినవారందరికీ అసోసియేషన్ ప్రతినిధులు బహుమతులు అందజేశారు. ఎంతో ఆనందభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.