బతుకమ్మ ఆర్డర్ల రేట్లు తగ్గించిన్రు

బతుకమ్మ ఆర్డర్ల రేట్లు తగ్గించిన్రు
  • ప్రతి మీటర్​పై రూపాయి కోత
  • సిరిసిల్ల నేతన్నలకు రూ.4 కోట్ల నష్టం
  • సర్కారు తీరుపై నేతన్నల అసంతృప్తి
  • అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఒక విధంగా బతుకునిస్తున్నాయి. కార్మికులకు చేతినిండా పని దొరుకుతోంది. కానీ టెస్కో ఆఫీసర్లు ఏడాదికో రూల్​పెడుతుండడంతో సిరిసిల్ల నేతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు సాంచెలు ఆధునీకరించుకుంటేనే ఆర్డర్లు ఇస్తామన్న టెస్కో.. ఇప్పుడు ప్రతి మీటరు వస్త్రంపై గతం కంటే రూపాయి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సిరిసిల్ల నేతన్నలు ఈ ఏడాది రూ.4 కోట్ల కూలి కోల్పోనున్నారు. సిరిసిల్ల మాక్స్, ఎస్ఎస్ఐ సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నేతన్నల పొట్ట కొట్టడానికే టెస్కో ఈ నిర్ణయం తీసుకుందని, మీటరు ధర తగ్గించడం కాదు.. పెంచాలని, అప్పటివరకు ఆర్డర్లు తీసుకోవద్దని నిర్ణయించారు. 

4.48 కోట్ల మీటర్ల ఆర్డర్​
సిరిసిల్లలో 136 మ్యాక్స్​సంఘాలు, 136 ఎస్ఎస్ఐ సంఘాల ద్వారా బతుకమ్మ చీరలను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. 2022 ఏడాదికి గాను ప్రభుత్వం 4.48 కోట్ల మీటర్ల బతుకమ్మ చీరలకు ముందస్తు ఆర్డర్​ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మీటరకు రూ.33 ఇవ్వగా ఇప్పుడు రూ.32 మాత్రమే ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది గిట్టుబాటు కాదని, దాదాపు 225 డిజైన్లతో బతుకమ్మ చీరలు తయారు చేయిస్తూ ధర తగ్గించడం ఏమిటని సిరిసిల్ల నేతన్నలు ప్రశ్నిస్తున్నారు. డిజైన్లు పెరిగేకొద్ది ధర పెరగాల్సి ఉండగా.. తగ్గించడం ఏంటని కార్మిక, పవర్​లూం సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బతుకమ్మ చీరల ఉత్పత్తి ధరలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2022 సంవత్సరానికి గాను 30 వేల మగ్గాలపై బతుకమ్మ చీరలు తయారు చేయనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది ఉపాధి పొందనున్నారు. కానీ టెస్కో ధర తగ్గింపు నిర్ణయంతో వస్త్ర పరిశ్రమలో, కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

ధర తగ్గింపు సరికాదు
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం సంతోషకరం. కానీ మీటర్​ ధర గత ఏడాది కంటే తగ్గించడం సరికాదు. డిజైన్ల పెంపుతో ఇప్పటికే కూలి గిట్టుబాటు కావడం లేదు. ఇప్పుడు రూపాయి తగ్గింపుతో కార్మికులు, ఆసాములు అందరూ నష్టపోతారు. మంత్రి కేటీఆర్​ దయ చూపాలి. ప్రభుత్వంతో మాట్లాడి తగ్గించిన ధర పెంచాలి.
– ఆడెపు సత్యనారాయణ, ఆసామి, సిరిసిల్ల

ఆర్డర్లు తిరస్కరిస్తం
రేటు తగ్గిస్తే నేతన్నలకు గిట్టుబాటు కాదు. ఇలాగైతే బతుకమ్మ ఆర్డర్లు తిరస్కరిస్తం. సొసైటీ సభ్యులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాం. సమావేశంలో భవిష్యత్​ కార్యాచరణ రూపొందిస్తాం. పెరిగిన ధరలకు అనుగుణంగా ధర పెంచాల్సిందే.
– చిమ్మని ప్రకాశ్, పవర్​లూం సొసైటీల జిల్లా అధ్యక్షుడు, సిరిసిల్ల

ఉన్నతాధికారులతో చర్చిస్తున్నం
మీటర్​కు రూపాయి తగ్గింపు ఉత్తర్వులు వాస్తవమే. కానీ గత ఏడాది చీరలకు జరీ ఉండేది. కానీ ఇప్పుడు లేదు. అందుకే మీటర్​కు రూపాయి తగ్గించాం. మ్యాక్స్, ఎస్ఎస్ఐ సంఘాల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.  
– సాగర్, ఏడీ, చేనేత జౌళిశాఖ, రాజన్న సిరిసిల్ల