
సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు ప్రపంచ లీగ్ లో సత్తా చాటిన ఈ సఫారీ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా తనదైన మార్క్ వేస్తున్నాడు. మంగళవారం (ఆగస్టు 12) ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో సునామీ ఇన్నింగ్స్ తో విశ్వరూపం చూపించాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని సంచలనంగా మారాడు. ఓవరాల్ గా 56 బంతుల్లో 12 ఫోర్లు, 8సిక్సర్లతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రెవిస్ ఇన్నింగ్స్ కు ఎన్నో రికార్డ్స్ తుడిచిపెట్టుకుపోయాయి. అంతేకాదు ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ ను అందుకున్నాడు.
బుధవారం (ఆగస్టు 13) ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో 80 స్థానాలు ఎగబాకి 21వ స్థానంలో నిలవడం హైలెట్ గా మారింది. ఆస్ట్రేలియాతో తొలి టీ20 తర్వాత బ్రెవిస్ టాప్-100 లో కూడా లేడు. అయితే ఒక్క ధనాధన్ సెంచరీతో ర్యాంకింగ్స్ లో అనూహ్యంగా దూసుకొచ్చాడు. 101 ర్యాంక్ లో ఉన్న ఈ సఫారీ కుర్రాడు 80 మందిని వెనక్కి నెట్టి 21 స్థానంలో నిలిచాడు. టీ20ల్లో సౌతాఫ్రికా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ (41 బాల్స్)తో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరుతో రికార్డుకెక్కాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు చేసిన సఫారీ ప్లేయర్‌గా ఫా డుప్లెసిస్ (2015లో వెస్టిండీస్‌పై 119) పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు.
ఇతర సౌతాఫ్రికా క్రికెటర్లలో ర్యాన్ రికెల్టన్ 45 స్థానాలు ఎగబాకి 81 వ స్థానంలో.. ట్రిస్టాన్ స్టబ్స్ 12 స్థానాలు ఎగబాకి 27వ స్థానాల్లో నిలిచారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఆరు నెలలుగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడకపోయినా ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. నాలుగో ర్యాంక్ లో ఉన్న సాల్ట్ మూడో స్థానానికి చేరుకున్నాడు. హెడ్ నాలుగో ర్యాంక్ కు పడిపోయాడు. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆరో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్ ల్లో సత్తా చాటిన ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు టిమ్ డేవిడ్ 6 స్థానాలు ఎగబాకి పదో స్థానంలో చోటు సంపాదించాడు.