ఆటో లైసెన్స్ కావాలంటేకారు నడపాల్సిందే..సారథి’ పోర్టల్లో త్రీవీలర్స్కు నో ఆప్షన్

ఆటో లైసెన్స్ కావాలంటేకారు నడపాల్సిందే..సారథి’ పోర్టల్లో త్రీవీలర్స్కు నో ఆప్షన్
  • సారథి’ పోర్టల్​లో త్రీవీలర్స్​కు నో ఆప్షన్
  • బైక్, కారు, ఆ పై వాహనాలనే మెన్షన్​ చేసిన కేంద్రం 
  • వందల మంది ఆటో డ్రైవర్ల తిప్పలు
  • కేంద్రానికి లెటర్​రాశామంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొత్తగా వచ్చిన ‘సారథి’తో ఆటో డ్రైవర్లకు లైసెన్స్​కష్టాలు వచ్చాయి. ఆర్టీఏలో ఆటో డ్రైవర్​లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే సారథి పోర్టల్​లో ఆప్షన్​లేదని, బైక్​, కారు, ఆపై వెహికల్స్​మాత్రమే ఉన్నాయని, లైసెన్స్​కావాలంటే కారు నడపాలని తిరకాసు పెడుతున్నారు. నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ఆటో డ్రైవర్లు గందరగోళంలో పడ్డారు. 

 ఆటో అన్న పదమే లేదు..!

ఆర్టీఏ గత కొద్ది రోజుల కింద ‘సారథి’ పోర్టల్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారానే లెర్నింగ్​లైసెన్స్, పర్మినెంట్​డ్రైవింగ్​లైసెన్స్, డ్రైవింగ్​లైసెన్స్ రెన్యువల్​చేస్తున్నారు. లెర్నింగ్​లైసెన్స్​కావాలనుకున్న వారు ఆన్​లైన్​లో స్లాట్​బుక్​చేసుకుంటే సరిపోతుంది. అయితే, పర్మినెంట్​లైసెన్స్​కావాలనుకుంటే మాత్రం టెస్ట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం టూ వీలర్స్, ఫోర్​వీలర్స్​అన్నింటికీ సారథి పోర్టల్​ద్వారానే లైసెన్స్​లు ఇష్యూ చేస్తున్నారు. సారథి రావడానికి ముందు అన్ని డ్రైవింగ్​ లైసెన్స్ ల  మాదిరిగానే త్రీ వీలర్స్ (ఆటో) లైసెన్స్​కూడా జారీ చేసే వారు. 

కానీ ‘సారథి’ అందుబాటులోకి వచ్చాక పోర్టల్​నుంచి త్రీ వీలర్​ను తొలగించారు. పోర్టల్​లో ఆటో అన్న పదమే లేదు. దీంతో ఆటో డ్రైవింగ్​వచ్చిన వారు లైసెన్స్​తీసుకోవాలనుకుంటే కుదరని పని అయిపోయింది. దీంతో చాలామంది అధికారులను సంప్రదిస్తే ‘ఇది కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సర్వీసు. ఇందులో ఆటోడ్రైవింగ్​అన్నది లేదు.. తామేమి చేయగలమని.. కేంద్ర ప్రభుత్వానికి లెటర్​రాస్తాం ’ అని చెప్తున్నారు. దీంతో ఆటో డ్రైవింగ్​లైసెన్స్​కోసం వెయిట్​చేస్తున్నవారు ఏం చేయాలో తెలియక  సతమతమవుతున్నారు. 

కారు నడిపితేనే ఎల్ఎంవీ లైసెన్స్​

ఆటో డ్రైవింగ్​కు అప్లయ్​చేసుకుంటే ఫోర్​వీలర్స్​నడపడం వచ్చి ఉండాలని అధికారులు చెబుతున్నారు. అంటే టెస్ట్​ డ్రైవ్​లో కారు నడిపి చూపిస్తే అధికారులు లైట్​మోటార్​వెహికల్ (ఎల్ఎంవి) లైసెన్స్​జారీ చేస్తున్నారు. ఫోర్ వీలర్స్​ డ్రైవింగ్​ లైసెన్​ తీసుకుని ఆటో ఎలా నడుపుతామని ఆటోడ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఆటో కొనుగోలు చేయాలన్నా ఆటోడ్రైవింగ్​లైసెన్స్​తప్పని సరి. గతంలో ఆర్టీఏ అధికారులు త్రీవీలర్స్​డ్రైవింగ్​లైసెన్స్​జారీ చేసే వారు. అప్పట్లో తీసుకున్న డ్రైవింగ్​ లైసెన్స్​తోనే ఇప్పటికీ కొందరు ఆటోలను నడుపుకుంటున్నారు. కొత్తగా ఆటో నడుపుకోవాలనుకునే వారిలో చాలా మందికి ప్రస్తుతం ఆటోడ్రైవింగ్​లైసెన్స్​లేదని ఆటోడ్రైవర్లు చెబుతున్నారు.

అంతే కాకుండా పాత ఆటో డ్రైవింగ్​లైసెన్స్​ఉన్న వారు కూడా గడువు పూర్తయిన తర్వాత రెన్యువల్​చేయించుకోవాలన్నా ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు చేయడం లేదని వాపోతున్నారు. అధికారుల తీరుతో కొందరు ఆటో డ్రైవర్లు కారు డ్రైవింగ్​ కోసం పరుగులు పెడుతున్నారు. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనీసం 10వేల వరకు ఖర్చవుతోందని, కారు డ్రైవింగ్​ నేర్చుకుంటే ఎల్​ఎంవి ఇస్తున్నారు కానీ త్రీవీలర్స్​ అని ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. సారథి పోర్టల్​లో నెలకొన్న గందరగోళమే ఈ పరిస్థితికి కారణమని ఆటో యూనియన్​ నాయకులు ఆరోపిస్తున్నారు.