- అమెరికా స్థావరాలపై దాడులు చేస్తం.. పొరుగు దేశాలతో స్నేహమే కోరుకుంటున్నం
- అమెరికాకు ఆశ్రయం ఇస్తే మాత్రం దాడులు తప్పవ్
- అమరుల త్యాగం వృథా కానివ్వం.. ప్రతీకారం తీర్చుకుంటం
- పదవీ బాధ్యతల అనంతరం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ తొలి హెచ్చరిక
- మా 3 షరతులకు ఒప్పుకుంటేనే.. యుద్ధం ముగుస్తది: పెజెష్కియాన్
- చీకట్లు తెస్తే.. అమెరికా సైనికులను వేటాడుతాం: అలీ లారిజానీ
- అమెరికా షిప్ పై ఇరాన్ డ్రోన్ అటాక్.. భారతీయుడు మృతి
- పర్షియన్ గల్ఫ్‌లో అండర్ వాటర్ డ్రోన్‌తో పేల్చివేత
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధిని మూసే ఉంచుతామని తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలోని శత్రు స్థావరాలపైనా దాడులు కొనసాగిస్తామన్నారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా గురువారం కెమెరా ముందుకు రాకుండానే ప్రభుత్వ టీవీ చానెల్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. మొజ్తబా ప్రకటనను న్యూస్ రీడర్ చదివి వినిపించారు.
పశ్చిమాసియాలోని తమ పొరుగు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఇంకా కొనసాగితే వాటిపై దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. "అమెరికా వీలైనంత త్వరగా ఇక్కడ ఉన్న తన స్థావరాలను మూసివేయాలని సూచిస్తున్నా. శాంతి, భద్రతలను నెలకొల్పుతామన్న అమెరికా వాదనలు పచ్చి అబద్ధాలని ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది" అని మొజ్తబా పేర్కొన్నారు.
ప్రతీకారం తీర్చుకుంటాం
యుద్ధంలో తమకు జరిగిన ప్రాణ నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటామని, శత్రువుల నుంచి కచ్చితంగా 'నష్టపరిహారం' వసూలు చేస్తామని మొజ్తబా ఖమేనీ శపథం చేశారు. ‘‘ఒకవేళ శత్రుదేశాలు పరిహారం చెల్లించడానికి నిరాకరిస్తే.. వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. లేదంటే శత్రువుల ఆస్తులను భారీ స్థాయిలో ధ్వంసం చేస్తాం”అని హెచ్చరించారు. "ఈ ప్రతీకార చర్యలు ఇప్పటికే కొంతమేర మొదలయ్యాయి. ఈ చర్యలు పూర్తిగా నెరవేరే వరకు మా ప్రాధాన్యతల్లో ప్రతీకారమే అగ్రస్థానంలో ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ ఎన్నటికీ వెనక్కి తగ్గదని, పూర్తి శక్తితో పోరాడుతుందని మొజ్తబా తెలిపారు. తన తండ్రి (దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ) మరణానికే కాకుండా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడి తరపున ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. "మా తండ్రి బలిదానం తర్వాత ఆయన పార్థివదేహాన్ని చూసే గౌరవం నాకు దక్కింది. నేను అక్కడ ఒక స్థిరమైన పర్వతాన్ని చూశాను. ఆయన చేతి పిడికిలి గట్టిగా బిగించి ఉందని నాకు చెప్పారు. ఆయన ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. నేను నా తండ్రి బాటలోనే నడుస్తా. అమరవీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడాన్ని మేం ఎప్పటికీ మర్చిపోం" అని మొజ్తబా తేల్చిచెప్పారు.
ఆర్మీకి, మిలిటెంట్ గ్రూపులకు కృతజ్ఞతలు
యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ పై దీటుగా పోరాడుతున్న మిలిటరీకి, అండగా నిలిచిన 'రెసిస్టెన్స్ ఫ్రంట్’ మిలిటెంట్ గ్రూపులకు మొజ్తబా ధన్యవాదాలు తెలిపారు. లెబనాన్, ఇరాక్, యెమెన్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఇరాన్ అనుబంధ సాయుధ గ్రూపులు ఈ యుద్ధంలో ఎంతగానో సాయపడుతున్నాయని ప్రశంసించారు. కాగా, యెమెన్‌లోని హౌతీలు, లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఇరాక్‌లోని మిత్రపక్షాలను కలిపి ఇరాన్ నాయకులు'రెసిస్టెన్స్ ఫ్రంట్(ప్రతిఘటన దళం)’గా పేర్కొంటారు.
ఇరాన్ రివెంజ్ అటాక్స్
ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను కువైట్, బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియా అడ్డుకుంటున్నాయి. గత 24 గంటల్లో కువైట్ 5 క్షిపణులను, 7 డ్రోన్లను గుర్తించింది. ఒక డ్రోన్ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేయగా స్వల్ప నష్టం వాటిల్లింది. విదేశీ చమురు ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ఇరాక్ తన చమురు నౌకాశ్రయ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ఇరాన్ సైన్యం గురువారం ఇజ్రాయెల్‌లోని అత్యంత కీలకమైన సైనిక స్థావరాలు, అంతర్గత భద్రతా సంస్థ 'షిన్ బెట్' ప్రధాన కార్యాలయంపై డ్రోన్లతో దాడులు చేసింది.
ఇజ్రాయెల్‌లోని పాల్మాచిమ్, ఓవ్డా వైమానిక స్థావరాలతో పాటు షిన్ బెట్ హెడ్‌క్వార్టర్స్‌ను తమ డ్రోన్లు విజయవంతంగా తాకాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అటు ఇరాన్, ఇటు లెబనాన్‌లోని హిజ్బుల్లా దళాలు సమన్వయంతో ఇజ్రాయెల్‌పై ఎదురుదాడిని ముమ్మరం చేశాయి.
ఇజ్రాయెల్ ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగిస్తున్నాయి. ఇక యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 13 మంది మరణించగా, సుమారు 2,000 మంది గాయపడ్డారు.
ఆయిల్ ధరలు పెరిగితే మాకే లాభం, కానీ..
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అమెరికా. కాబట్టి చమురు ధరలు పెరిగితే మేం చాలా డబ్బు సంపాదిస్తాం. కానీ నా దృష్టిలో అంతకంటే ముఖ్యమైన విషయం ‘దుష్ట సామ్రాజ్యం’ అయిన ఇరాన్‌ను అడ్డుకోవడం. ఆ దేశం అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా చూడటమే నా మొదటి ప్రాధాన్యత. అణ్వాయుధాలతో ఇరాన్ పశ్చిమాసియాను, అంతిమంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. నేను దానిని ఎప్పటికీ జరగనివ్వను.
- యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
అమెరికా సైనికులను వేటాడతాం: అలీ లారిజానీ
ఇరాన్ విద్యుత్ వ్యవస్థను గంటలోగా చిన్నాభిన్నం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు, ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. అమెరికా గనుక ఇరాన్ విద్యుత్ సరఫరాపై దాడి చేస్తే, తాము మొత్తం పశ్చిమాసియా ప్రాంతాన్ని అరగంటలో చీకటిమయం చేస్తామని ఆయన హెచ్చరించారు.
"ఒక్కసారి కరెంట్ పోయి చీకటి ముసిరితే.. ప్రాణరక్షణ కోసం పరుగులు తీసే అమెరికా సైనికులను వేటాడటానికి మాకు అద్భుతమైన అవకాశం దొరుకుతుంది" అని ఆయన ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. అలీ లారిజానీ ఇటువంటి హెచ్చరికలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మంగళవారం కూడా ఆయన ట్రంప్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ "ఖతం" అయ్యే అవకాశం ఉందని పరోక్షంగా చంపేస్తామంటూ సంచలన కామెంట్ చేశారు.
