
తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీ గా వరద వస్తుండటంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని వదలుతున్నారు. గోదావరి బేసిన్ లో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వస్తోంది. కడెం, స్వర్ణ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి 1,51,47 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో పవర్ జనరేషన్ నడుస్తోంది. 7 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు
అటు నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టులో 26 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు ప్రస్తుతం 2లక్షల54వేల784 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో 2లక్షల 90,795 క్యూసెక్కులుగా ఉంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు..ప్రస్తుతం 310.510 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.