సినీ నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొలిక్కిరాని చర్చలు.. కండీషన్స్ ఒప్పుకోవాలి ప్రొడ్యూసర్స్ షరతు

సినీ నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొలిక్కిరాని చర్చలు..  కండీషన్స్ ఒప్పుకోవాలి ప్రొడ్యూసర్స్ షరతు

కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. .ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు.  కొన్ని ప్రతిపాదనలు కొలిక్కిరాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు  సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్మాత దిల్ రాజు సూచించారు.

గత పది రోజులుగా 30 శాతం వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే పలుసార్లు  నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్  మధ్య చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. దీంతో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి..  ఇరువురు ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమైయ్యారు. 

ఫెడరేషన్ నేతలు ముందుగా వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని యూనియన్లకు ఒకే రకంగా వేతనాలు పెంచాలని కోరారు. దీంతో  నిర్మాతల తరపున రెండు కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. గతంలో ఉన్న  రెండు  ప్రతిపాదనలు సరిగా అమలు కాలేదు. వాటితో పాటు మరో రెండు కొత్త నిబంధనలను ఫెడరేషన్ ముందుంచారు. ఈ నిబంధనలను ఒప్పుకుంటేనే వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ప్రొడ్యూషర్స్  చెప్పినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.

అయితే, రూ.2 వేల కంటే తక్కువ వేతనం ఉన్నవారికి, అలాగే రూ.3 వేలకు పైగా వేతనం ఉన్న డ్యాన్సర్లు, ఫైటర్లు, టెక్నీషియన్లకు ఒక పర్సెంటేజీ ప్రకారం పెంచడానికి నిర్మాతలు అంగీకరించినట్లు దిల్ రాజు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలపై అన్ని యూనియన్లతో చర్చించి, తుది నిర్ణయంతో రావాలని ఫెడరేషన్ ప్రతినిధులకు సూచించారు.  చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయని, మరో రెండు, మూడు రోజు ఈ సమావేశాలు ఉంటాయని దిల్ రాజు తెలిపారు. ఇద్దరినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

చర్చలు పూర్తైయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. నిర్మాతల ప్రతిపాదనలు అన్ని యూనియన్లతో చర్చించి తమ అభిప్రాయాన్ని  చెబుతామని చెప్పారు.  మరో రెండు మూడు చర్చల తర్వాత కార్మికుల వేతనాల పెంపు, నిర్మాతల ప్రతిపాదనలపై ఒ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.